మేలైన ' మేలిమి చింత ': జె. శ్యామల
 నమస్తే ప్రమోద్ గారూ!
మీ కవిత్వం ' మేలిమి చింత ' చదివాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంతో మేలైందిగా ఉంది.
నేను ప్రధానంగా కథకురాలిని. కథలు, కాలమ్స్, ఆర్టికల్స్, బాలల కథలు, సమీక్షలు రాశాను.  అయితే కవితలు కూడా ఓ గుప్పెడు రాసినా  అవి అంత లెక్కించదగ్గవి కావు. కవిత్వపు లోతుపాతులు నాకు అంతగా తెలియవు. అందువల్ల మీ కవిత్వాన్ని సమీక్షించే సాహసం చేయలేను.  అందుకు మన్నించాలి.  కానీ నా స్పందనగా.. నాకు తోచిన, నచ్చిన అంశాలు రేఖామాత్రంగా చెపుతాను.
దుఃఖం రెండక్షరాల మాటే కానీ అనుభవంలో అది ఆకాశంలా అనంతమైనది..పాతాళమంత లోతైనది.  వియోగ దుఃఖాన్ని అధిగమించడం కష్టసాధ్యం. అందుకే దుఃఖ సముద్రంలో మునిగిన ఎందరో కవులు, రచయితలు అక్షరాన్ని ఆశ్రయించి అందులో సాంత్వన పొందారు..పొందుతున్నారు. నాయని సుబ్బారావుగారి ' విషాద మోహనం; విశ్వనాథ గారి ' వరలక్ష్మీ త్రిశతి ' ; దేవులపల్లి వారి ' కృష్ణపక్షం..వగైరాలు ' ..ఇలా ఎన్నెన్నో అద్భుత రచనలు ఉన్నాయి. మీ ' మేలిమి చింత ' లోనూ అధిక భాగం  ..మీ సమస్తం అనుకున్న అర్థాంగి అస్తమయం మీకు చేసిన మాయని గాయం నుంచి వెలువడ్డ కవితలే.  సాంద్రతరమైన  భావనలు అద్భుతం!  
ముఖ్యంగా 
' ప్రాణం కొట్టుకుంటది '
కవిత మనసు చెమరించేలా.. శ్మశానం.. తంతులు.. చితి మంటలు.. మది మంటలు .. ఆ దృశ్యాన్ని కళ్ళకుకట్టింది.
ఇందులో ' విచారణ లేకుండా శిక్షలు వేసే విధి ' వాక్య ప్రయోగం బాగుంది. అలాగే
ఆ గల్లీకి పోయినప్పుడల్లా
ప్రాణం కొట్టుకుంటది
గేటు లోపల ఆ ప్రాణం
జ్ఞాపకమై తొంగిచూస్తుంది 
' గొప్ప అభివ్యక్తి.
' చేతనమైన పదం ' కవితలో
పుట్టినరోజే మరణానికి ముహూర్తం
ఖరారు చేసుకోవడమే కదా జీవితం ! '  ..ఎంత నిజం !
' ఒంటరితనం ' కవితలో
అర్థంకాని చిక్కుముడే జీవితం.. చిక్కని మాట.
' ముఖం చాటేసిన కాలం ' పద ప్రయోగం నవ్యంగా..నాణ్యంగా ఉంది.
అక్షరం రగులుతుంది.. కవితలో...
కరువుదీరా ఎండిపోయిన చెరువు, అర్థం కానిదీ ప్రపంచ సిలబస్సు ' బాగున్నాయి.
' రాతిరి స్వప్నం ' కవితలో
మూసుకున్న కళ్ళ ముందు
ముగింపులేని కథ ఒకటి కదలాడుతుంది .. చాలా బాగుంది. అలాగే
' గగనం సెలవు ప్రకటించడం ' కూడా.
' ఫోటో ' కవిత ' అక్షర దృశ్య మాలిక ' గా ఉంది.
' మార్చురీ ' కవిత మనసును మెలిపెట్టేలా ఉంది.
వియోగ గీతాలు ' లో 
నువ్వు వెళ్ళిపోయాక నవ్వుకి
నవ్వులు కరువయ్యాయి.. బాగుంది.
రెండక్షరాల అద్భుతమైన ' కల ' ను ఎంతో భావ సౌందర్యంతో చాలా కవితల్లో పొదిగారు.
' రాత్రి వర్షం ' ..కవితలో...
మనసు కిటికీ తెరిచాను
జ్ఞాపకాలు వచ్చి చుట్టూ చేరాయి
అప్పటి ఆ రోజుల్లోకి
సుడిగాలి ప్రయాణం చేసి వచ్చి
ఇప్పటి ఈ పూటకి సరిపడా
అనుభూతిని పొందాను..
అద్భుతంగా ఉంది.
ఇలా చెప్పాలంటే ఎన్నెన్నో! 
' అక్షరం ' కవితలో  ఆఖరు ఆరు పంక్తులు...
అర్థం ఉంటుంది
అర్థం చేసుకుంటుంది
అర్థవంతంగా ఇమిడిపోతుంది
ప్రవహిస్తుంది...ప్రయాణిస్తుంది
కూడా తీసుకెళుతుంది
కాల్పనిక ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది
' అక్షర సత్యాలు '.
ఇక సామాజికాంశాలు..ఇతర అంశాల మీద రాసిన ఆడబతుకు, ఆడపిల్ల, నాన్న, కలికాలం, ఎదురుచూపులు ... కవితలు సారవంతంగా, సార్థకంగా ఉన్నాయి.
పాఠకుడిని ప్రభావితం చేసే... కొన్నాళ్ళ పాటు వెంటాడే కవిత్వం ఇది. మనసున్న మనుషులకు మరింత నచ్చే కవితలెన్నో అందించిన మీరు అభినందనీయులు.

కామెంట్‌లు