కొత్తపేట నుంచి దిల్ సుఖ్ నగర్ కు వెళ్ళే దారిలో చైతన్యపురి బస్టాప్ వెనుకవైపు నా చిన్నప్పటి క్లాస్ మేట్
ఆనంద్ వాళ్ళ ఇల్లు ఉంది.కింద మడిగలు,పైన వాళ్ళు
ఉండేవాళ్ళు.ఆ మడిగల్లో ఒక దానిలో ఒక ఫర్నీచర్ షాప్ ఉండేది.దానికి సంబంధించిన గోడౌన్ ఆ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉండేది.ఆ షాపు ఓనర్ గంగుల గోవర్ధన్ రెడ్డి.ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక ఊరు.ఆయన అప్పటికే రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో
పదవి ఉన్న నాయకుడు.అన్ని పత్రికలకు సంబంధించిన
విలేకరులు ఆయన దగ్గర రోజులో ఏదో సమయంలో
కూర్చోని మాట్లాడి వెళ్ళిపోవడం జరుగుతుండేది.
ఉదయం వెళితే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనం చేసే వరకు ఎవరినీ ఖాళీగా వెళ్ళనిచ్చేవాడు కాదు.పాలమూరు జిల్లా వాళ్ళు ప్రేమగల్లోళ్ళు అనీ, కష్టజీవులనీ లోకం మాట.ఆ మాటకు మనిషి రూపమే గంగుల గోవర్ధన్ రెడ్డి.ఒక వైపు తన ఫర్నీచర్ వ్యాపారం చేసుకుంటూనే రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనే వాడు.నేను ఉదయంలో పని చేసేటప్పుడు ఆయన ఏర్పాటు చేసే పత్రికా సమావేశాలకు వెళ్ళేవాడిని.చాలా ఆప్యాయంగా తినిపో అన్న అంటూ అంటుండేవాడు.తన కన్నా వయసులో చిన్న అయినా పెద్ద అయినా అందరినీ అన్నా అని సంభోదించేవాడు.మంచి వ్యక్తిత్వం.కష్టం విలువ తెలిసిన వాడు.తన దగ్గరకు వచ్చిన వాళ్ళును తినకుండా వెళ్ళనిచ్చేవాడు కాదు.మన జీవిత ప్రయాణంలో రకరకాల మనుషులు తారస పడుతుంటారు.వాళ్ళల్లో
కొందరు గుర్తుంటారు.కొందరినీ మర్చిపోతుంటాం.మనిషి
బతకడానికి వివిధ వ్యాపకాలు చేస్తూ ఉన్న సమయంలో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.అలాంటి వాళ్ళల్లో ఏదో ప్రత్యేకత,రేర్ క్వాలిటీ,మాట్లాడే విధానం,
వాళ్ళ ప్రవర్తన,వాళ్ళ వ్యవహార శైలి..ఇలా ఏదో దానికి మనం కనెక్ట్ అవుతాం...అంటే ఎదుటి మనిషిలో మనకు నచ్చిన అంశాలు కనిపించినప్పుడే వాళ్ళతో స్నేహం అభివృద్ధి చెందుతుంది.రెండు మస్తిష్కాలు నచ్చిన కొన్ని విషయాలలో ట్యూన్ కావడం వల్ల,ఒకే విధమైన ఆలోచనా సరళి,ఒకే రకమైన వ్యక్తీకరణ.... లాంటి అంశాలు ఆ స్నేహం గట్టి పడేందుకు దోహద పడతాయి.ప్రస్తుతానికి వస్తే గంగుల గోవర్ధన్ రెడ్డితో
అప్పటి ఆ స్నేహాన్ని ఇప్పటి వరకు కొనసాగించ లేకపోయినా ఆనాటి నా జర్నలిస్టు జీవితంలో ఆయన గురించిన కొన్ని పుటలు ఉంటాయి.. ఉన్నాయి.తొంభై వ
దశకంలోనీ ఆ పుటలను తిరగేస్తే నిజాయితీ గల స్నేహితుడుగా కనిపిస్తాడు.దాదాపు ముప్పై ఏళ్లు ఆయనను కలిసింది లేదు.కానీ ఆయన గురించిన విషయాలు పెద్దలు,మిత్రులు,రాధామనోహర్ రావు ద్వారా తెలుసుకుంటునే ఉన్నాను.గంగుల తన బిజినెస్ ని తమ్ముడికి అప్పజెప్పి,తాను ఇరవై ఏళ్ల క్రితం మహాత్మా గాంధీ లా కాలేజీని ప్రారంభినట్లు తెలిసింది.ఆ కాలేజీ
రంగారెడ్డి జిల్లా కోర్టు పక్కన ఉన్న చిత్రా లే అవుట్ లో
తన స్వంత భవనంలో నిర్వహిస్తున్నట్లు తెలియడమే కానీ
నేను ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు.అదేంటో కొన్ని కొన్ని సార్లు విచిత్రంగా అనిపిస్తుంది.మనకు సంబంధించిన వాళ్ళు,మన బంధువుల,స్నేహితుల ఇళ్ళ ముందు నుంచి
ఒక్కొక్కసారి వెళుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించలేం.చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం... లాంటి నగరంలోనీ ఇతర చారిత్రాత్మక స్థలాలను చూడడానికి ప్రపంచం అంతా కదిలి వస్తుంది... కానీ మనం వాటి ముందు నుంచే రోజూ తిరుగుతుంటాం అయినా లోపలికి వెళ్ళి చూడం... దానికి ఎవరికి వారికి
ఏవో కారణాలు ఉంటాయి.ఆ కారణాలు వాళ్ళ వ్యక్తిగతం.అలా నేను మహాత్మా గాంధి లా కాలేజీ ముందు
ఉన్న హైవే మీద నుంచి వేలసార్లు ప్రయాణించి ఉంటా.కానీ నాకు ఆ కాలేజీకి వెళ్ళడం కుదరలేదు....
కుదరలేదు అంటే తప్పేమో..ఆ అవసరం రాలేదు..అంటే
కూడా తప్పవుతుంది...అయితే అవసరం కోసమే స్నేహమా..అవసరం కోసమే బంధుత్వమా...అంటే మానవ సంబంధాలు అన్నీ అవసరాల కోసమేనా..అనే ప్రశ్న నా మస్తిష్కాన్ని తొలుస్తుంది.అంతా అవసరాల కోసమే అనుకుంటే మనిషి ఎమోషనల్ ఫీలింగ్స్ పరిస్థితి ఏంటి.. ఎమోషన్స్ లో ప్రేమ,బాధ, కష్టం, సుఖం,కోపం,
సంతోషం, లాంటివి ఎన్నో ఉన్నాయి.అయితే ఒకరిని ప్రేమించడం కూడా ఒక అవసరమేనా.. మనిషికి బాధ కలిగినప్పుడు ఓదార్చేందుకు తోటి మనుషులు ఉండడం అవసరమేనా..కోపం ప్రదర్శించడానికీ ఎవరో ఒకరు అవసరం కాదా... సంతోషం వస్తే పంచుకోవడాని మళ్ళీ అవసరం ఏర్పడదా...కట్ చేస్తే...
మా కుటుంబంలోని అమ్మాయి అయిదు సంవత్సరాల లా కోర్సు చదవాలనుకుంది.ఇంటికి దగ్గరగా
ఉన్నందున మహాత్మా గాంధి లా కాలేజీలోనే చదివించాలని అనుకుంది ఆ కుటుంబం... ఇదిగో ఈ కారణంగా నేను ముప్పై ఏళ్ల తర్వాత గంగుల గోవర్ధన్ రెడ్డిని కలిసే అవసరం ఏర్పడింది...అవసరం.. ఎన్ని సంవత్సరాలు అయినా వ్యక్తులను కలుపుతుందా..
అంటే అవుననక తప్పడం లేదు.గంగులను కలవడానికి
ఒకరోజు ముందుగానే రాధా మనోహర్ రావు గారితో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు ఇద్దరం మహాత్మా గాంధి లా కాలేజీలోని గంగుల
ఆఫీసు దగ్గర సిద్ధంగా ఉన్నాం.సరిగ్గా పదకొండున్నరకు
దాదాపు కోటి రూపాయల ఖరీదైన నల్ల రంగు కారులో నుంచి దిగి గంగుల తన ఆఫీసులోనికి వెళ్ళాడు.ఒక పది నిమిషాల తర్వాత మాకు పిలుపొచ్చింది.రాధన్నా రారా కూర్చో అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ఆహ్వానించాడు.నా వైపు చూస్తూ ఒక పరిచయస్తుడిగా
విష్ చేసాడు.అద్బుతమైన ఆఫీసు రూం.. మినిస్టర్ కార్యాలయాన్ని తలదన్నేలా ఉంది.మనిషిలో ఏ మార్పూ లేదు.ముపై ఏళ్ల క్రితం లాగానే మాటకు ముందు, మాటకు
తర్వాత అన్న అంటూ సంబోధిస్తూ,పాత జ్ఞాపకాలను
పునశ్చరణ చేసుకుంటూ చాలా సేపు గడిపాం.మధ్యలో
సేపు పండ్ల ముక్కలు, తిరుపతి లడ్డూ ప్రసాదం ఇస్తూ
తినన్నా..అంటూ ఆయన అంటుంటే.. ముప్పై ఏళ్ల నుంచి
ఎవరొచ్చినా ఏదో ఒకటి తినిపించి పంపించే ఒక మంచి
సంస్కృతిని కొనసాగిస్తున్న ఆయనను చూస్తూ అలాగే ఉండి పోయాను....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి