సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-927
ఏకా మసిద్ధిం పరిహరతో ద్వితీయా పద్యతే న్యాయము
****
ఏకా అనగా ఒకటి.మసిద్ధిం అనగా సిద్ధింపబడని, అసంపూర్ణమైన,నిరూపించబడని, ఉనికిలో లేని.పరిహరతో అనగా పరిహారం చేయుట,నివారించుట. ద్వితీయా అనగా రెండవది.పద్యతే అనగా పొందుతుంది, చేరుకుంటుంది అనే అర్థాలు ఉన్నాయి.
అసిద్ధి అనగా తన ఆశయము నెరవేరకపోవుట.ఆశ్రయాసిద్ధి, స్వరూపా సిద్ధి,వ్యాప్యతా సిద్ధి అని అసిద్ధి మూడు విధములు.
ఒక రకపు అసిద్ధిని ఎట్లో దాటిన వెనువెంటనే రెండవది ఆపాదించినట్లు అని న్యాయము యొక్క అర్థము. ఒక అసిద్ధి  నుండి అనగా  సిద్ధించక,సాధించక పోవడంతో మరొకటి ఎంపిక చేసుకుంటే అందులోనూ అపజయం అసిద్ధి కలగడం అని అర్థముతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
అయితే దీనిని కొందరు బుద్ధుని స్వరూప సిద్ధి,వ్యాపతా సిద్ధితో పోల్చడం ఇక్కడ గమనించ వచ్చు. దానికి సంబంధించిన సంస్కృత వాక్యం చూద్దాం.
"అంకురాద్య కర్తృకం శరీర్య జన్యత్వాత్" అను స్థలమున "శరీరీ" అను విశేషణముచే స్వరూపాసిద్ధిని నివృత్తి చేయు బుద్ధునికి వ్యాప్యతా సిద్ధి సంభవించినట్లు "అని అర్థము.
స్వరూప సిద్ధి అనగా స్వంత స్వభావాన్ని, స్వరూపాన్ని,అంతర్గత సత్యాన్ని అర్థం చేసుకోవడం. బుద్ధుని దృష్టిలో అష్టాంగ మార్గం మరియు ఐదు సూత్రాల ద్వారా అంతర్గత స్వభావాన్ని అర్థం చేసుకుని జ్ఞానోదయ స్థితికి చేరుకోవడం.
ఇలా  స్వరూప సిద్ధి నుండి వ్యాప్యతా సిద్ధిలోకి పోవడం అంటే ఏమిటో బుద్ధుడు ఇలా చెబుతాడు."మొదటిది సురక్షితంగా ఉండాలి.మొదటిది స్వరూప సిద్ధి.ఇది అవగాహన‌ చేసుకోగలిగితేనే వ్యాప్యతా‌ సిద్ధిస్తుంది".
ప్రపంచ ఉనికిని అంగీకరించి,పూర్వ ఉనికిని తిరస్కరించినప్పుడు వ్యాప్యతా సిద్ధిని తెలుసుకోలేమని, అలా తెలుసుకోలేక పోవడం వల్ల అనుకున్నది సాధించలేమనీ, ఇవి ఒకదానికొకటి జోడింపబడి ఉంటాయనీ,ఒక స్థితి నుంచి మరొక స్థితికి పోవాలంటే ఎక్కడా అసిధ్ధి ఎదురు కావద్దని అంటారు.
అనగా ఒక అనర్థమును తప్పించుకొనిన మఱొక అనర్థము పైబడినట్లు కాకూడదని అంటారు.
"ఏకా మసిద్ధిం పరిహరతో ద్వితీయా పద్యతే న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.  ఒకోసారి ఒకటి సిద్ధించకుండా మరొక దానికి ప్రయత్నిస్తే ఆ మరొకటి కూడా సిద్ధించని పరిస్థితి ఏర్పడుతుందనేది  ఈ న్యాయము లోని అంతరార్థము.
కాబట్టి మొదటి దానినే ఎలాంటి  సంశయాలు లేకుండా సంకల్ప బలంతో సిద్ధింపజేసుకుంటే రెండవది సిద్ధించక, సాధించక పోవడం అనేది ఉండదు.ఇదంతా ఆలోచించే మనసు ఆచరించే తీరును బట్టి ఉంటుందనేది అర్థం చేసుకోవాలి.

కామెంట్‌లు