సూర్య 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచీ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వినేవాడు. ఫలితంగా ప్రతిసారీ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంతో మెచ్చుకునేవారు.
కానీ సూర్యకు పెద్ద బలహీనత ఉన్నది. చిన్నప్పటి నుంచీ రోజూ పాఠశాల నుంచి ఇంటికి చేరగానే పుస్తకాల సంచి ఇంటివద్ద పడేసి, స్నేహితుల బృందంతో చీకటి పడేదాకా క్రికెట్ ఆడి వచ్చేవాడు. సెలవు రోజులలో అసలు ఇంటిపట్టున ఉండడు. సూర్య ఏకసంతాగ్రాహి కాబట్టి అతని చదువుకు ఇబ్బంది లేదు. కానీ సూర్య క్రికెట్ పిచ్చి మూలంగా ఎంతోమంది చదువులో మొద్దులు అవుతున్నారు.
సూర్య చెల్లెలు అపర్ణ. 6వ తరగతి చదువుతున్నది. అపర్ణ కూడా చాలా తెలివైన అమ్మాయి. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటుంది. ఇంటివద్ద ఒక పది పదిహేను నిమిషాలు పుస్తకాలు తిరిగేస్తుంది. అంతే. ఆ తర్వాత ఏమి చేయాలో తోచదు. "అన్నయ్యా! ఇంటిపట్టునే ఉండి నాతో ఆడుకోవా. చెస్, క్యారమ్స్, షటిల్ ఏ ఆటైనా ఆడుదాం. ప్లీజ్ అన్నా! నాకు ఏమీ తోచడం లేదురా." అనేది అపర్ణ. "సరే! రేపటి నుంచి నీతోనే ఆడుకుంటాలే." అనేవాడు సూర్య. మరునాటి నుంచీ షరా మామూలే. క్రికెట్ క్రికెట్ క్రికెట్. ఏళ్లు గడుస్తున్నాయి. అడిగీ అడిగీ అడిగీ బాగా బతిమాలి చివరకు విసిగి పోయి ఈ అన్నయ్య ఇంతేలే అనుకుంది అపర్ణ.
ఒకరోజు కొంతమంది పిల్లల తల్లిదండ్రులు సూర్య ఇంటి మీదికి గొడవకు వచ్చారు. "మీ వాడు క్రికెట్ పిచ్చితో మా పిల్లలను కూడా చెడగొడుతున్నాడు. మీ వాడు తెలివైన వాడు కావచ్చు. కానీ స్వార్ధపరుడు. తనకు మాత్రమే చదువు వస్తే సరిపోతుందా? తన మూలంగా మిగతా వాళ్ల సమయం అంతా వృథా అయ్యి, వాళ్ళ చదువు అటకెక్కుతుంది. అది ఆలోచించడా మీ వాడు? తల్లిదండ్రులు భయం చెప్పరా? మా పిల్లలు ఫెయిల్ అయితే మీరంతా బాధ్యత వహించాలి." అంటూ బాగా గొడవ పెట్టుకున్నారు. అప్పుడు సూర్య తల్లిదండ్రులు 'మీ పిల్లలను బయటికి వెళ్ళనీయకుండా ఇంటివద్ద భయం మీరు చెప్పుకోవాలి. మీ బాధ్యతను పక్కన పెట్టి, మా వాడిని తిడితే బాగుండదు." అన్నారు. గొడవ ముదిరి చివరకు ఆగిపోయింది.
అప్పుడు సూర్య ఆలోచనలో పడ్డాడు. అవును. తాను స్వార్థ పరుడినే. కేవలం తన వినోదం గురించే ఆలోచించా. ఇతరుల భవిష్యత్తు దెబ్బ తింటుంది అని ఆలోచించలేదు. ఇకనైనా తాను మారాలి. ఇంటివద్దనే ఉండి చెల్లెలితోనే ఆడుకోవాలి అనుకున్నాడు.
అన్నయ్యా! ఆటాడవా? : -సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి