వృద్ధులకోసం వినూత్న కార్యక్రమం:- - యామిజాల జగదీశ్
 ఒక కెనడియన్ పాఠశాల ప్రపంచం మొత్తం నేర్చుకోవలసిన పనిని చేస్తోంది.
ప్రతి సంవత్సరం, రెజీనాలో గల  ఒక ఉన్నత పాఠశాల నిజంగా హృదయపూర్వక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇది మరెక్కడా లేని "సీనియర్ ప్రోగ్రాం."
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులెవరంటే... తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వృద్ధులు. వీరిలో చాలామంది నిరుపేదవారు,  ఏ అండా లేకుండా ఒంటరిగా నివసిస్తున్న వారు. వీరి ఆచూకీ గుర్తించి తప్పనిసరిగా కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తారు విద్యార్థులు. 
విద్యార్థులు భారీ ఎత్తున విందును సిద్ధం చేస్తారు. వారికి దుస్తులు ధరించడంలో సహాయం చేస్తారు. వారి కోసం రవాణా ఏర్పాటు చేస్తారు.
ఎవరూ వెనుకబడి ఉండకుండా చూసుకుంటారు. వారి కోసం మేము మీకున్నామనే రీతిలో సంగీతం కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. హృదయ పూర్వకమైన  ఆనందాన్ని గౌరవంగా బహుకరిస్తారు.
కొందరు దశాబ్దాలుగా నృత్యం చేసి ఉండరు. అటువంటి వృద్ధులను ఆటపాటలతో ఉల్లాసంగా ఉండేలా చేస్తారు. ఈ కార్యక్రమంతో వారి జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని తిరిగి రాస్తారు. పరస్పరం ఆలింగనం చేసుకుని తన్మయులవుతారు. పాత రోజులను జ్ఞాపకం చేసుకుంటారు.
ఆ రాత్రికి, తాతలు బామ్మలు మళ్ళీ యవ్వనంగా మారతారు. వారితో కలిసి టీనేజర్లు కరుణామయ హృదయంతో సాదరంగా మాట్లాడి  వారి జీవితాల్లో నూతనోత్సాహాన్ని తీసుకొస్తారు. 
ఈ అందమైన సంప్రదాయం దాదాపు 30 సంవత్సరాలుగా జీవితాలను మారుస్తోంది.
సానుభూతి నేర్పించవచ్చనే శక్తిమంతమైన జ్ఞాపిక ఈ కార్యక్రమంగా భావిస్తారు.
ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న  విద్యార్థులను, వారికి సహకరిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించక తప్పదు. ఈ క్రమంలో యువతరంలో మానవత్వం వికసిస్తోంది. పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పుతోంది. 

కామెంట్‌లు