సుప్రభాత కవిత : - బృంద
చినుకు చినుకుగా కురిసే 
చిన్ని చిన్ని నీటి ముత్యాలు
నేలకు నింగి ప్రేమతో పంపే 
మేలిమి నెయ్యపు ముద్దులు

వానగా వాగుగా వంకగా
ఏటిగా సెలయేటిగా సాగి
నదిగా పాయగా ఎన్నో 
మలుపులు దాటి చేరు కడలి

సాగరుని  చేరిన క్షణమే తన
అస్తిత్వము కోలుపోయి 
సంబరముగా సంగమించి
ఆవిరిగా అంబరాన్ని చేరు చినుకు

వచ్చిన చోటునే కోరి చేరి
నచ్చిన దారుల పయనించి
ముచ్చటైన పుడమికి కానుకగా
పచ్చదనం ప్రసాదించే చినుకు.

జీవరాశుల దాహర్తి తీర్చి 
మానవ జాతి కుక్షి నింపు
అన్నసిద్ధికి ఆధారభూతమైన
పర్జన్య  ప్రసాదము చినుకు

ఒక్కొక్క బిందువులో
అంతర్యామి రూపు చూసి
ఆనంద సంభ్రమాన ఆర్తిగా
అంజలి ఘటింతు భక్తిగా

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు