నాన్నారం కథలు పుస్తకం ఆవిష్కరణ
   గ్రామీణ ప్రాంతాలలో జరిగే సంఘటనలను ఇతివృత్తాలుగా తీసుకుని పిల్లల కథలు రాయడం, కృష్ణ స్వామి రాజు ప్రత్యేకతని ఓ.ఆర్.ఐ.డైరెక్టర్ ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు అన్నారు. సామాజిక దృక్పథంతో పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాజుగారు కథలు రాయడం విశేషమని ఆయన పేర్కొన్నారు.
            శనివారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్  బ్రెడ్ సంస్థ వారు ప్రచురించిన రచయిత ఆర్సీ కృష్ణ స్వామి రాజు ‘నాన్నారం కథలు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పిల్లల్లో కథల పట్ల ఆసక్తి కలిగించడానికి బ్రెడ్ సంస్థవారు రెండు వేల  పుస్తకాలను ప్రచురించి ఉభయ రాష్ట్రాలలోని పాఠశాల గ్రంథాలయాలకు ఉచితంగా ఇవ్వడాన్ని ఆయన అభినందించారు.
            ఈ పుస్తకాన్ని ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు, ప్రాచ్య కళాశాల అధ్యాపకులు హేమంత్ కుమార్, శతావధాని ఆముదాల మురళిలు ఆవిష్కరణ చేసి తొలి ప్రతిని కవి తోట వెంకటేశ్వర్లు కు అందించారు.
            ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల సాహిత్యం ఎంత విరివిగా వస్తే సాహిత్యం అంతగా విరజిల్లుతుందని పేర్కొన్నారు. తల్లితండ్రులు కథలను పిల్లల చేత చదివించాలని, పుస్తకాలు కొనిపించే అలవాటు చేయాలని వారు సూచించారు.
            ఈ కార్యక్రమంలో అంకమనాయుడు, మౌని, ఆకుల మల్లేశ్వరరావు, మల్లారపు నాగార్జున, మన్నవ గంగాధర ప్రసాద్, యువశ్రీ మురళి, డాక్టర్ నెమిలేటి కిట్టన్న, పేరూరు బాలసుబ్రమణ్యం, మూరిశెట్టి గోవింద్, సుధాకర్, లక్ష్మి, ప్రసాద్, సత్యాల బాదుల్లా, గొడుగుచింత గోవిందయ్య గంగరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రచయితను ముఖ్య అతిథులను సత్కరించారు.

కామెంట్‌లు