"నా పేరు శ్రుతి. మీ క్లాస్ మేటుగా కొత్తగా మీ పాఠశాలలో చేరాను. నన్ను మీ స్నేహితురాలిగా స్వీకరించండి." అన్నది ఆ పాఠశాలలో కొత్తగా చేరిన శ్రుతి. వందన చెయ్యి అందించలేదు. చిరాగ్గా చూసింది వందన. మిగతా వాళ్ళకూ తనను పరిచయం చేసుకుంది. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళెవరూ శ్రుతిని పట్టించుకోలేదు. వాళ్లందరు వందనను చూసి, అలాగే ప్రవర్తిస్తున్నారు. శ్రుతి బాధ పడలేదు. పట్టించుకోలేదు. ఇలాంటి పొగరుబోతుల స్నేహం లేకపోవడమే ఉత్తమమని భావించింది.
శ్రుతిని వందన పట్టించుకోకపోవడానికి కారణం శ్రుతి నలుపు రంగులో ఉంది. వందన క్లాస్ ఫస్ట్. కానీ పొగరు ఎక్కువ. చదువులో ఫస్ట్ వస్తే మిగతా వారిని చదువులో ప్రోత్సాహించి తన అంత తెలివి గలవారిని చేయాలి కానీ వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ తనకు అనుకూలంగా మార్చుకునేది. వాళ్ళను కూడా పొగరుబోతుల్లా మార్చింది.
శ్రుతి నల్లగా ఉందని రకరకాల ఉపమానాలతో హేళన చేస్తున్నారు అందరూ. శ్రుతి వాటిని పట్టించుకోలేదు. స్రవంతికి బాధగా అనిపించింది. శ్రుతి మంచితనాన్ని గమనించి, శ్రుతితో స్నేహం చేసింది స్రవంతి. శ్రుతి తీరిక సమయాలలో అందమైన బొమ్మలను గీస్తుంది. స్రవంతి స్నేహం దొరికిన తర్వాత స్రవంతిని కూడా తీరిక సమయాలలో తన పక్కన కూర్చుని చిత్ర లేఖనం నేర్పింది. పట్టుదలతో స్రవంతి చిత్ర లేఖనం నేర్చుకుని, మంచి ఆర్టిస్ట్ అయింది.
శ్రుతి తాను చదువుకునే వేళల్లో స్రవంతిని కూడా పక్కన కూర్చోబెట్టుకుని కంబైన్డ్ స్టడీ చేసేది. చదువులో శ్రుతి తేటలకు స్రవంతి ఆశ్చర్యపోయింది. కానీ పరీక్షల్లో ఫస్ట్ ఎందుకు రావడం లేదో అర్థం కాలేదు. క్రమంగా శ్రుతి కూడా స్రవంతిని తనంత చురుకైన విద్యార్థినిగా తయారు చేసింది.
వార్షిక పరీక్షలు ముగిసాయి. పరీక్షా ఫలితాల్లో శ్రుతి క్లాస్ ఫస్ట్, స్రవంతి క్లాస్ సెకండ్ వచ్చింది. చిన్నప్పటి నుంచీ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే వందన ఫస్ట్ టైం మూడవ ర్యాంకుకు దిగజారింది. తనను హేళన చేస్తున్న వందనకు భలేగా బుద్ధి చెప్పిందిలే అనుకుంది స్రవంతి. శ్రుతి చిన్నప్పటి నుంచీ చాలా తెలివైన విద్యార్థిని. కొన్నాళ్ల పాటు ఆ తెలివిని దాచి పెట్టింది. అంతే.
మిత్రలాభం : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి