సుప్రభాత కవిత : - బృంద
నీలి స్వప్నాల నిదుర రేయి 
తేలి స్వర్గాల చిందులు వేసి 
మేలిపొద్దుల మెరుపులు చూసి 
సోలి నేలకు దిగివచ్చు వేళ....

నల్ల మబ్బుల చీకటి దాటి 
తెల్లని కాంతులు కుమ్మరించి 
చల్లగ జగతిని మేలుకొలుప
మెల్లగా వచ్చు వేకువ వేళ...

తెలియని ఉద్వేగపు సందడిలో 
తెలిసిన ఉత్సాహపు ఒరవడిలో
ఎగసిన హృదయపు పొంగులలో 
నిలిచెను తూరుపు నిన్నలలో....

రేపటి వెలుగులు దీపాలై 
మాపటి కలతలు తొలగించి 
ఓపటి సుఖముల మూటలను 
మోపుగ కట్టి మోసుకురాగా...

మిన్న అయిన  మోదాలు 
కన్నుల కాంతులు నింపగా 
ఎన్నో నోముల ఫలాలు 
తిన్నగా దోసిట నింపేయాలని..

దూరపు కొండల మధ్యన 
చేరని  తీరాల దాపున 
కోరిన వరాలు కురిపించు 
మేరువు వంటి వేలుపు రాగా..

భూపాలముతో భువి పలికే

🌸🌸సుప్రభాతం🌸🌸



కామెంట్‌లు