ఆడపిల్ల పుడితే…హర్షించేదెవరు..?:- కవి రత్న సాహిత్య ధీర -సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి -అత్తాపూర్ హైదరాబాద్
ఆడపిల్ల పుడితే...?
తల్లి...ముఖాన చిరునవ్వులు
మరుమల్లె పువ్వుల్లా విరబూస్తాయి…
తల్లిగా తన్మయత్వం చెందుతూ...
అమ్మదనంలోని 
కమ్మదనాన్ని ఆస్వాదిస్తుంది..!

తండ్రి...తన తల్లి
మళ్లీ తన కూతురై
మా ఇంటి మహాలక్ష్మిలా...
మా కంటికి వెలుగురేఖలా...
జన్మించిందని మురిసిపోతాడు..!

కొంతమంది 
మధ్యతరగతి జీవులు
కుదరని సంబంధాలకు విసిగి...
ఖరీదైన కట్నకానుకలకు బెదిరి...
ఎదిగిన కన్న కూతుర్ని
గుండెల మీద పెనుభారంగా...
ఆరని కుంపటిగా భావిస్తారు...!

పేదరికం పెళ్లితలుపుల్ని మూసేస్తే…
పెళ్లి ఒక సుందర స్వప్నమౌతుంది...
ఆడపిల్లల ఆశలు...కన్న కలలు...
గాలివానలో చిక్కిన గాలిపటాలౌతాయి…

ఖర్మకాలి…
కల్యాణం జరిగి కాపురానికెళ్తే...
అత్తామామ...ఆడపడుచులు 
ఆశబోతులైతే..?
కట్నకానుకల పిశాచులైతే..? 
కట్టుకున్న మొగుడు...
కళ్ళున్న కబోధైతే..?
నోరున్న మూగజీవైతే..?
చెవులున్న బధిరుడైతే..?

పులులగుహలో దూరిన ఆ జింకపిల్లకు…
అత్తారింటెన్ని అగ్నిపరీక్షలో ఎవరికెరుక..?

కూతురు చేసే కన్నీటి కాల్స్ కి
వియ్యాలవారి వింతవింత 
కోర్కెలు తీర్చలేక...కోర్టు మెట్లెక్కలేక...
కుమిలిపోయే తల్లిదండ్రులెందరో... 

ఎందరెందరో...ఔను...నిజానికి 
ఆడపిల్ల పుడితే…హర్షించేదెవరు...?


కామెంట్‌లు