‘హృదయ వేదన’ :- పైడి రాజ్యలక్ష్మి
అధికారం కోసం పోట్లాటల్లో 
అమాయకులు బలై పోతున్నారు 
ఈ విపత్కర పరిస్థితి నుండి విముక్తి కావాలి 
నిజం కోసం నిలబడి ప్రశ్నించ గలగాలి 
ప్రజలే రాబోయే భవిత కోసం ముందుకు సాగాలి  
సత్యాన్ని చూపగలిగే సత్తా నేర్పు ఉండగలగాలి దేశాన్ని 
తప్పు త్రోవ పట్టించే వార్తా మాధ్య మాల 
యాజమాన్యాన్ని ప్రక్షాళన చేయగలగాలి  
న్యాయస్థానాల్లో అన్యాయాన్ని చూడలేని ధర్మదేవత 
కళ్ళను తిరిగి సత్య వీక్షణతో శోభిల్లచేయాలి  
ధర్మబద్ధమైన రాజకీయ నాయకులను ధైర్యంగా 
చూపగలిగే మాధ్యమాలు రావాలి ప్రతీ మనిషి 
ఓటు మీద ఒట్టేసి ఒక ఉప్పెనలా విస్తరించి 
అవినీతి రాజకీయాలపై విరుచుకు పడాలి
ఓటే ఆయుధం,దాన్ని విజ్ఞానంతో పదునుపెట్టాలి  
స్వార్థముతో కట్టిన కోట గోడలను పగులగొట్టాలి  
ఉత్తేజంతో యువశక్తి ఉరకలేసి రంకె వేయాలి 
ఈ వ్యవస్థపై వుండే ఘర్షణ అవినీతిని 
చీల్చే నినాదమై గొంతునుండి ధ్వనించాలి 
దేశానికి ప్రాణాలర్పించే ఎందరో మహానుభావులు 
వారినుండి స్ఫూర్తిని గుండె నిండుగా నిల్పి 
అడుగులు ముందుకు వేయాలి
 
 ఒక్క ఓటు చాలు-అధికారం కదిలిపోవటానికి 
 ఒక్క ప్రశ్న చాలు-అబద్ధం బైట పడడానికి 
 సంఘటిత మైన ప్రజల గళం చాలు 
రాజ్యాలను చీల్చడానికి, ముక్కలు చెయ్యటానికి 
ప్రతీ హృదయవేదన ఒక సునామీ అయి 
ఈ వ్యవస్థను అంతంచేయగలగాలి 
అప్పుడే పటిష్టమైన రాజ్యాన్ని పొందగలుగుతాము  
భద్రతతో కూడిన భవితకు 
బంగారు బాట వేయగలుగుతాము 
న్యాయాన్ని నిలిపే ధర్మదేవత 
కరుణ పొందగలుగుతాము


కామెంట్‌లు