సింతకాయంత సిన్నోని కథ :-డా.ఎం. హరి కిషన్
 ఒకూర్లో ఒక సింతకాయంత సిన్నోడున్నాడు. ఆ సింతకాయంత సిన్నోడికి పెసరగింజంత పెండ్లాముంది. వాళ్ళకు ఎలక్కాయంత ఎద్దులు, సెనక్కాయంత సేనూ వున్నాయి. ఒకరోజు సింతకాయంత సిన్నోడు సెనక్కాయంత సేనుని ఎలక్కాయంత ఎద్దులతో దున్నుతా వుంటే వంకాయంత వజ్రం దొరికింది.
        వెంటనే ఆ సింతకాయంత సిన్నోడు ఆ వంకాయంత వజ్రం తీస్కోనిపోయి బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసినాడు.
అది చూసిన ఒక దోసకాయంత దొంగోడు ఆ తాటికాయంత తాళం పగులగొట్టి బీరకాయంత  బీరువాలో నుంచి వంకాయంత వజ్రాన్ని దొంగిలించుకోని పోయినాడు. అది చూసిన ఒక మునక్కాయంత ముసల్ది వెంటనే పొట్లకాయంత పోలీసుకు పనసకాయంత ఫోన్లో చెప్పింది.
వెంటనే ఆ పొట్లకాయంత పోలీసు కాకరకాయంత కారేసుకోనొచ్చి ఆ దోసకాయంత దొంగోన్ని పట్టుకొన్నాడు. ఆ పొట్లకాయంత పోలీసు దోసకాయంత దొంగోన్ని  బెండకాయంత బెత్తంతో కొట్టి, జీడికాయంత జైలులో వేసి ఆ వంకాయంత వజ్రాన్ని తీస్కోని పోయి సింతకాయంత సిన్నోడికి తిరిగిచ్చేసినాడు. 
********

కామెంట్‌లు