కందనవోలు యువరాజుకు వేట అంటే చానా ఇష్టం. ఒకరోజు అడవిలో క్రూర మృగాలను వేటాడుతూ దారి తప్పిపోయాడు. ఎంత వెదికినా వెంట వచ్చిన సైనికుల జాడ కనపడలేదు. అలా వెతుక్కుంటూ పోతావుంటే ఒక గ్రామం కనపడింది. ఒంటరిగా విలువైన హారాలతో తిరగడం మంచిది కాదు కదా... దాంతో అవన్నీ తీసి లోపల పెట్టేశాడు. సామాన్యుడిలా గ్రామంలోకి ప్రవేశించాడు.
అప్పటికే సూర్యుడు నడినెత్తికి వచ్చేశాడు. ఎండ వేడికి భూమి సెగలు కక్కుతోంది. పెదవులు తడి ఆరిపోయి విపరీతంగా దాహం కాసాగింది. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయింది. దాంతో ఆ గ్రామంలో నీళ్ల కోసం వెదుకుతా వుంటే ఒకచోట ఒక బావి కనపడింది. అక్కడ ఒక చిన్నపాప నీళ్లు చేదుకుంటా ఉంది. యువరాజు పోయి 'దాహం' అంటే ఒక పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందివ్వబోయింది. అంతలో అక్కడికి ఇంకొక అమ్మాయి వచ్చింది. చూడముచ్చటగా ఆకాశం నుంచి కిందికి పడుతున్న వానచినుకులా అద్భుతంగా ఉంది. ఆ అమ్మాయి రావడం రావడం యువరాజుకు ఇస్తావున్న నీళ్లపాత్రను గబుక్కున లాక్కొని ఆ నీటిని కిందికి మీదికి పదిసార్లు తిరగతిప్పి ''ఇప్పుడు తాగండి'' అంటూ అందించింది. యువరాజు దప్పిక తీర్చుకున్నాక ఆ అమ్మాయితో ''ఎందుకు... ఆ చిన్నపాప నీళ్లు ఇస్తావుంటే చేతిలోంచి గుంజుకొని అలా తిరగతిప్పి ఇచ్చావు'' అని అడిగాడు.
దానికి ఆ యువతి నవ్వి ''ఏమీ లేదు... నువ్వు ఎండనబడి ఎంతో దూరం నుంచి వచ్చావు గదా... నీ శరీరం బాగా వేడెక్కి ఒళ్లంతా చెమటలు కారుతా వున్నాయి. అదే సమయంలో ఈ బావిలో నీళ్ళు చానా చల్లగా ఉంటాయి. వేడెక్కిన శరీరంతో అంత చల్లని నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఊహించని ప్రమాదాలు ఏర్పడవచ్చు. అందుకే ఆ నీటిని కాసేపు తిరగ తిప్పేసరికి అవి చల్లదనాన్ని కోల్పోయి కొంచెం గోరువెచ్చగా మారాయి. అప్పుడు ఇచ్చాను'' అంది.
యువరాజు ఆ అమ్మాయి తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు. 'అందమైన వాళ్ళకు తెలివి ఉండకపోవచ్చు. తెలివైనవాళ్లకు అందం లేకపోవచ్చు. కానీ తెలివి అందం రెండూ ఒకేచోట ఉన్నవాళ్లు లోకంలో చానా అరుదుగా ఉంటారు' అనుకుంటూ ఆ అమ్మాయిని పరిశీలనగా చూశాడు. కాలికి మెట్టెలు లేవు. మెడలో నల్లపూసలు లేవు. నుదుట కుంకుమబొట్టు లేదు. సంబరంగా చిరునవ్వు నవ్వుకుంటూ ''మీ నాన్న ఏం చేస్తాడు'' అని అడిగాడు వివరాల కోసం.
ఆమె చిరునవ్వుతో ''మా కుటుంబమంతా నేత పని చేస్తాము. ఈ చుట్టుపక్కల ఊర్లలో మేము తయారు చేసే బట్టలు అంటే చానా ప్రసిద్ధి'' అని చెబుతూ ''ఇంతకీ నువ్వెవరు. ఎప్పుడూ ఎక్కడా చూడలేదే. ఈ ఊరికి కొత్తనా'' అని అడిగింది.
దానికి యువరాజు తాను ఎవరో చెప్పకుండా ''నాది కందనవోలు. అడవిలో దారి తప్పి ఇక్కడికి వచ్చాను. త్వరలో మరలా కలుస్తా'' అంటూ అక్కడినుంచి తన ఊరికి ఎలా వెళ్లాలో దారి కనుక్కొని బయలుదేరాడు.
ఇంటికి పోయాక వాళ్ళ అమ్మానాన్నలతో జరిగిందంతా చెప్పి ''నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. అట్లాంటి తెలివైన పిల్లని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు'' అన్నాడు.
దానికి వాళ్ళ నాన్న ''చూడు నాయనా... నువ్వు నడుస్తా వుంటే కాళ్ళ కింద అడుగడుగునా తివాచీలు పరుస్తారు. కానీ వాళ్లకి వేసుకోవడానికి కాళ్లకు చెప్పులు కూడా ఉండవు. నీకు ఆకలైన మరుక్షణం బంగారు పాత్రలలో మధురమైన తినుబండారాలన్నీ కళ్ళ ముందుంటాయి. కానీ వాళ్లకు సత్తు గిన్నెలో సద్దన్నం కూడా సరిగా ఉండదు. మనం రాజులం. వాళ్లు సామాన్యులు. వాళ్ళకూ మనకూ కుదరదు గానీ అనేకమంది రాజకుమార్తెలు నీకోసం ఎదురుచూస్తా ఉన్నారు. వాళ్ళ చిత్రపటాలు తెప్పిస్తా. నచ్చిన వాళ్ళను ఎన్నుకో. అంగరంగ వైభవంగా వేడుక జరిపిస్తా'' అన్నాడు.
కానీ... యువరాజు పట్టిన పట్టు విడవలేదు.
''కళ్ళు మూసినా, తెరిచినా ఆ పిల్లనే కళ్ళముందు కనపడతా ఉంది. కాదంటే రాజ్యాన్ని అయినా వదిలేస్తాను కానీ ఆ పాపను వదలను. నేను సంతోషంగా వుండాలో వద్దో తేల్చుకోండి'' అన్నాడు.
దాంతో మహారాజు చేసేదేం లేక మంత్రిని పిలిచి ఆమె అభిప్రాయం కనుక్కొని రమ్మని మంచి మంచి కానుకలు ఇచ్చి పంపించాడు. మంత్రి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి విషయం అంతా వివరించాడు. రాజసంబంధం అని చెప్పగానే ఇంట్లో అందరూ సంతోషపడ్డారు. కానీ ఆ అమ్మాయి ''యువరాజు మాట తీరు గుర్తుకు తెచ్చుకుంటే చానా మంచివానిగా, గర్వం లేనివానిగా కనపడతా ఉన్నాడు. కానీ అతనికి ఏ పనిలోనైనా నైపుణ్యం ఉందా'' అని అడిగింది.
ఆ మాటలకు మహామంత్రి చిరునవ్వు నవ్వి ''అమ్మా... అతను కాబోయే మహారాజు. చిటిక వేస్తే వందమంది వంగి వంగి సలాం కొడతారు. సైగ చేస్తే చాలు కోరుకున్నవన్నీ కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. అటువంటి అతనికి పని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది'' అన్నాడు.
దానికి ఆ అమ్మాయి ''లేదు... లేదు... ఈ లోకంలో రాజైనా, పేదైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ఖచ్చితంగా నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సంపదలు ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ నేర్చుకున్న పని మాత్రం చివరి వరకు తోడుంటుంది. ఏ పనీ రానివాన్ని నేను చేసుకోను'' అంటూ కానుకలు తిప్పి పంపించింది.
విషయం తెలుసుకున్న యువరాజు ''ఆమె చెప్పింది కూడా నిజమే. నా కోసం కొంత గడువు ఇవ్వమనండి. అంతలోపు ఏదో ఒక పనిలో నైపుణ్యం సంపాదించి ఆ తర్వాతనే పెళ్లి చేసుకుంటా'' అని ఆమెకు కబురు పంపించాడు.
ఆ తర్వాత యువరాజు ఒక అద్భుతమైన కళాకారున్ని పిలిపించి బంగారు తీగలతో బట్టలు ఎలా నేయాలో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఏడాది తిరిగేసరికి అద్భుతమైన బట్టలు అల్లికలు నేయడం వచ్చేసింది. ఆ అమ్మాయికి పెళ్లి చీర తానే స్వయంగా నేసి కానుకగా పంపించాడు. ఆ ముచ్చటైన పనితనం చూసి ఆమె చానా సంబరపడింది. దాంతో వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా ఊరంతా అలంకరించి పెళ్లి చేశారు.
కొంత కాలానికి మహారాజుకు వయసు పైబడ్డంతో యువరాజే పరిపాలనా బాధ్యతలు చూసుకోసాగాడు. ఒకసారి తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశాడు. అందరూ ప్రజలంతా సుఖశాంతులతో సంతోషంగా ఉన్నారనీ, రాజ్యంలో ఎక్కడా ఎటువంటి గొడవలు లేవనీ చెప్పారు. అది విన్న యువరాణి ''రాజా... మన కింద పని చేసేవాళ్ళు ఎవరైనా సరే మనలోని తప్పులను ఎత్తిచూపరు. నిజాలు చెప్పరు. ఏమీ బాగాలేకున్నా అంతా బాగుందంటూ మాయమాటలు చెబుతారు. కాబట్టి ప్రజల వద్దకు మారువేషంలో నేరుగా వెళితేనే మీకు నిజాలు తెలుస్తాయి'' అని చెప్పింది.
యువరాజుకు ఆ సలహా నచ్చింది. ఎవరు కనుక్కోకుండా ఒక పల్లెటూరి రైతు వేషం వేసుకొని రాజ్యంలో ఊరూరూ తిరగసాగాడు. ఒకసారి ఒక గ్రామంలో తిరుగుతా వుంటే ఒక ధనవంతుడు తన అనుచరులతో వస్తూ కనపడ్డాడు. ఆయన నడుస్తుంటే జనాలు దారిలో అతని కాళ్ళకి వేడి తగలకుండా తడి చీరలు పరుస్తా వున్నారు. నెత్తిన ఎండ తగలకుండా గొడుగులు పడుతా వున్నారు. అతను గ్రామం మధ్యలో రచ్చబండ దగ్గరకు చేరుకున్నాడు. అనేకమంది అతన్ని చుట్టుముట్టుకొని ''అయ్యా... బ్రతకడానికి చానా కష్టంగా ఉంది. ఏదైనా మంచి పని ఇప్పించండి'' అని అడుగుతూ ఉన్నారు.
యువరాజు కుతూహలంగా ఆ గుంపులో చేరి ఆ ధనవంతున్ని చూడసాగాడు. ఆ ధనవంతుడు యువరాజును చూసి దగ్గరికి పిలిచాడు. ''నీ మొహం చూస్తుంటే ఈ ఊరికి కొత్తవానిలా వున్నావే. ఎవరు నీవు'' అన్నాడు. దానికి యువరాజు ''అయ్యా... నేను ఒక నేత పనివాన్ని. నా పనితనం చూసి ఎవరైనా మంచిపని ఇస్తారేమో అని ఊరూరు తిరుగుతా వున్నా'' అని చెప్పాడు. దానికి అతను ''నా వద్ద కొన్ని వేలమంది పనివాళ్ళు రకరకాల పనులు చేస్తా ఉన్నారు. నువ్వు కూడా రా. నీకు సరిపోయిన పని ఇప్పిస్తాను'' అంటూ వెంట పిలుచుకొని పోయాడు.
వాళ్లతో పాటు అనేకమంది పనుల కోసం వాళ్లను అనుసరించారు. వాళ్లు సాయంకాలానికంతా ఊరి బయట ఉన్న ఒక పెద్ద కొండ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ అంతా సాయుధులైన అనుచరులు తిరుగుతా ఉన్నారు. ఆ కొండ మధ్యలో ఒక పెద్ద గుహ ఉంది. దానికి తాళం వేసి వున్న ఇనుప వాకిలి ఉంది. పనుల కోసం వచ్చిన వాళ్లంతా లోపలికి అడుగుపెట్టగానే బయట తాళాలు బిగించారు. లోపల విశాలమైన ప్రదేశంలో చానామంది రకరకాల పనులు చేస్తూ కనిపించారు. ఎవరి ఒంటిమీద చూసినా కొంచెం కూడా కండ లేదు. మొహంలో చిరునవ్వు లేదు. అస్తిపంజరాల్లా బక్కచిక్కి పోయి వున్నారు. మౌనంగా దిక్కులు చూడకుండా తల వంచుకొని యంత్రాల్లా పనిచేస్తూ వున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లను చూసి అక్కడ ఉన్న ఒక సాయుధుడు ''రండి... ఈరోజు నుంచి మీరంతా మా బానిసలు. ఎదిరిస్తే చావటం ఖాయం. మీరు మాట్లాడకుండా చెప్పిన పని చెప్పినట్టు చేయాలి. ఇక్కడ లోపలికి రావడమే తప్ప బైటికి పోవడం అంటూ వుండదు. జాగ్రత్త'' అని హెచ్చరించాడు. యువరాజుకు తాను వాళ్ళ చేతిలో బందీని అయ్యాను అని అర్థమయింది. ఉద్యోగం ఇస్తానని మాయ మాటలు చెప్పి అనేకమందిని తీసుకువచ్చి అక్కడ బంధిస్తున్నారని తెలుసుకున్నాడు. బయటికి పోవడానికి ఎటువంటి దారి లేదు. అడుగడుగునా ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. మధ్యలో సలసలా కాగుతున్న ఒక పెద్ద నీటి పాత్ర ఉంది. ఎదిరించిన వాళ్ళని ఎత్తి అందులో పారేస్తున్నారు. అన్నం పెట్టకుండా చీకటి గదిలో వేసి కొడతా వున్నారు. అక్కడినుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు.
అంతలో ఒకడు వచ్చి ''నీకు నేత పని వచ్చు అన్నావు కదా... ఏమి చేయగలవు. నీకోసం ఏమి తెప్పించాలి'' అన్నాడు.
దానికి యువరాజు ''అయ్యా... నేను అందరిలా బట్టలో, చీరలో నేసే మామూలు నేతపని వాడిని కాదు. బంగారు తీగలతో కళ్ళు చెదిరిపోయేలా నాజూకైన చీరలు నేయగలను. కేవలం రాజకుటుంబీకులు, కోటీశ్వరులు మాత్రమే వాటిని కొనగలరు'' అన్నాడు.
'సరే' అంటూ అతను అవసరమైనంత బంగారాన్ని, పనిముట్లను తెప్పించి యువరాజును ఒక గదిలో పెట్టి లోపల వేశాడు. యువరాజు తాను నేర్చుకున్న నేతపనితో పది రోజులు రాత్రింబవళ్లు కష్టపడి ఒక అద్భుతమైన సన్నని బంగారు చీరను తయారు చేశాడు. ఆ చీరను చూసి ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. ''నేను ఇంతవరకు ఎన్నో రకాల చీరలు చూశాను గానీ, ఇంత సుందరమైన చీరను ఎప్పుడూ చూడలేదు. చూస్తావుంటే కళ్ళు మిరిమిట్లు గొలుపుతా ఉన్నాయి. దీని ధర ఎంత'' అన్నాడు.
ఆ మాటలకు యువరాజు ''అయ్యా... ఈ చీరను మామూలు మనుషులు ఎవరూ కొనలేరు. ఈ దేశ యువరాణికి బంగారు చేరాలంటే చానా మోజు. నేను అనేకసార్లు ఆమెకే అమ్మాను. అసలుకు పదింతలు ఖచ్చితంగా ఇస్తుంది'' అన్నాడు.
'సరే' అని ఆ ధనవంతుడు భద్రంగా ఆ విలువైన చీరను తీసుకొని తర్వాతరోజు యువరాణి వద్దకు చేరుకున్నాడు. యువరాణి ఆ చీరను చూడగానే ఆశ్చర్యపోయింది. అది అచ్చం తన భర్త తన పెళ్లికి కానుకగా పంపించిన బంగారు రంగు చీరలాగానే ఉంది. దానిని విప్పి పరిశీలనగా గమనించింది. చీర అంచులో యువరాజు బంధింపబడిన గ్రామం పేరు, అక్కడి కొండ ప్రదేశానికి వెళ్లే దారి, గుహ గురించిన వివరాలు చిన్న చిన్న బొమ్మల రూపంలో పువ్వుల మధ్య చిత్రింపబడి ఉన్నాయి. నేతపని తెలిసిన వాళ్లకు మాత్రమే ఆ రహస్యాలు అర్థం అవుతాయి.
వెంటనే యువరాణి ఆ ధనవంతున్ని బంధించి కారాగారంలో వేసింది. కారం అద్దిన కొరడా తీసుకువచ్చి కొట్టినచోట కొట్టకుండా ఒళ్లంతా ఒక్క ఇంచు కూడా వదలకుండా కొట్టింది. దాంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక వాడు జరిగిందంతా చెప్పి ఆ గుహకు పోయే దారి వివరించాడు. వెంటనే యువరాణి పెద్ద సైన్యంతో ఆ గుహ వద్దకు చేరుకుంది. అంతమంది సైనికులను ఆయుధాలతో చూడగానే అక్కడ కాపలా వున్నవారు ఎక్కడి ఆయుధాలు అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. యువరాణి తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయింది. బందీలందర్నీ విడిపించి జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ ఊర్లకు పంపించింది.యువరాజుతో కలసి తిరిగి రాజ్యానికి చేరుకుంది.
మహారాజు తిరిగి వచ్చిన కొడుకుని చూసి సంతోషించి ''తల్లీ... నువ్వు ఆరోజు ఏదైనా ఒక వృత్తి నేర్చుకోవాలని షరతు పెడితే మొదట నాకు చానా కోపం వచ్చింది. కానీ ఆ విద్య వల్లే ఈరోజు యువరాజు క్షేమంగా తిరిగి మన ముందుకు రాగలిగాడు. ఇదంతా మీ ముందుచూపు వల్లనే. ఇప్పటినుంచీ పరిపాలనలో నీ మొగునికి సలహాలు ఇస్తూ చివరి వరకు చేయి విడువకు'' అంటూ కోడలిని మెచ్చుకున్నాడు.
**********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి