దానం (2):- ఎం బిందుమాధవి

 ఇంతకు ముందు..విక్రమార్కుడి సింహాసనాన్ని అధిష్టించటానికి సిద్ధపడిన భోజరాజుని మొదటి బొమ్మ అతని దాన శక్తి విక్రమార్కుడి దాన శక్తితో ఎప్పటికీ సమానం కాదని చెబుతూ అతన్ని నిరోధించిందని తెలుసుకున్నాం కదా.
మరి భోజరాజంతటి వాడు, తనని అంత మాట అన్న బొమ్మని అసలు విక్రమార్కుడి దాన గుణంలోని ప్రత్యేకత ఏమిటి అని అడగకుండా ఉంటాడా..అడిగాడు..అదే ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకనాడు విక్రమార్కుడి కొలువుకి ఒక కవీంద్రుడు వచ్చాడు. ఆయన విక్రమార్కుడిని నాలుగు భాషలలో దీవించి, తనకి బహుభాషా ప్రజ్ఞ ఉన్నదని చెప్పకనే చెప్పాడు. విక్రమార్కుడు ఆ కవిని యథోచితంగా సత్కరించాడు.
ఆ కవి “రాజా నా పేరులో ఆరు అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరం తీసేస్తే ‘అశ్వ విద్యావేత్త’, రెండక్షరాలు తీసేస్తే ‘నాట్య శాస్త్రజ్ఞుడు’, మూడక్షరాలు తీసేస్తే ‘గత కాలజ్ఞుడు’, నాలుగు తీసేస్తే ‘నేర్పరి’, ఐదు తీసేస్తే బుద్ధి బలమున్న ‘ప్రౌఢుడు’. నా పేరు కనుక్కోండి. నేను చెప్పిన ఈ విషయం నేటి బీరకాయలో నెయ్యి లాంటి శుష్కమైనది కాదు సుమా, నేను సార్ధక నామధేయుడిని” అంటాడు.
కవీంద్రా తమ నామధేయం “చతురంగతజ్ఞ” కదా అంటాడు విక్రమార్క మహారాజు. పేరులో మొదటి అక్షరం తీసేస్తే ‘తురంగతజ్ఞ’..అనగా అశ్వ శాస్త్రం తెలిసిన వాడు, రెండవ అక్షరం తీసేస్తే ‘రంగతజ్ఞ’ అంటే నాట్య శాస్త్రం తెలిసినవాడు, మూడవ అక్షరం తీసేస్తే ‘గతజ్ఞ’ అంటే గతించిన కాలం గురించి తెలిసిన వాడు, నాలుగవ అక్షరం తీసేస్తే ‘తజ్ఞ’ అంటే నేర్పరి, ‘జ్ఞ’ అంటే బుద్ధి బలం కలవాడు అని అర్ధం అని చెప్పాడు విక్రమార్కుడు.
విక్రమార్కుడి ప్రజ్ఞకి సంతోషించిన కవి “రాజా మీరు సూర్య సమాన తేజస్సు కలవారు. మీ చేతి దాన జలధారలవల్ల వచ్చిన కీర్తి అనే తెల్లని కలువ కాంతి ముల్లోకాలలోనూ ప్రకాశిస్తున్నది. ఆ కాంతికి మీ ప్రతాపం అనే సూర్య కాంతి జోడై మరింత ప్రకాశిస్తున్నది. ఆ కాంతిలో ఆకాశం తుమ్మెద లాగా చిక్కుకుని సువాసనలు వెదజల్లుతున్నది” అని కీర్తించాడు.
విక్రమార్కుడు కవి మాటలకి ఎంతో సంతోషించి. అలాంటి కవిని చూసినందుకు వెయ్యి, అతని మాటలకి పది వేలు, నవ్వుకి లక్ష, కవిత్వానికి కోటి బంగారు నాణెలు ఇచ్చి పంపించాడు.
అంతటి ఔదార్యం నీకు లేదు అని ఆ బొమ్మ చెప్పింది.
మనం ఈనాడు వాడుతున్న ‘అక్షర లక్ష’ అనే నానుడి ఇలానే వచ్చి ఉండచ్చు అనుకుంటున్నాను
ఇలాంటి కథల ద్వారా భాషల ప్రాముఖ్యత, అందులో ఉండే గొప్పతనం, మన మాటలో చూపించ వలసిన ప్రజ్ఞ తెలుస్తాయి. భాష కూడా ఒక గొప్ప సమగ్రమైన శాస్త్రం. భాషని ఒక ప్రధాన పాఠ్యాంశం గా చేసుకుంటేనే ఇలాంటి లోతుపాతులు తెలుస్తాయి.
విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక శాస్త్రం మాత్రమే కాదు..భాషా శాస్త్రం వాటి కంటే గొప్పది, లోతైనది అని తెలుస్తుంది. సాంకేతిక శాస్త్రాలు భౌతికమైన విషయాల గురించి వివరిస్తే, భాష ఆ శాస్త్రాల గురించిన భావ ప్రకటనకి ఉపయోగపడుతుంది . అది మానసిక వికాసానికి ఉపయోగపడే శాస్త్రం.
ప్రముఖ రచయిత ‘శ్రీ నాగసూరి వేణు గోపాల్’ గారు ఈ విషయంపై ‘అత్యున్నతమైన కళా రూపమే సైన్సు’ అనే పుస్తకం రచించారు. భాష, సాహిత్యం, సంగీతం అనే కళలు ..సైన్స్ అని విడి విడిగా కనబడుతున్న రంగాలు రెండూ పరస్పర ఆధారితమై తమ అత్యున్నత రూపాన్ని ఆవిష్కరిస్తాయి అని అందులో వారు చక్కగా వివరించారు.
సాంకేతికత ఎక్కువై, మానసిక సమస్యలతో బాధపడుతున్న నేటి తరం, ఇలా భాష ప్రాముఖ్యత తెలుసుకుని, సాహిత్యం చదివి ఆనందించగలిగితే ఆరోగ్య సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తుంది. అవునంటారా!

కామెంట్‌లు