సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము పంచమాశ్వాసము ప్రారంభము: * 23వ రోజు*
ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు వారికి ఉపనయనం చేయించాడు. ముగ్గురు అన్ని విద్యలలో ఆరితేరారు.పాండురాజు ఆనాటి రాజులలో విలువిద్యలో శ్రేష్టు డయ్యాడు. దృతరాష్ట్రుడు శరీర బలములో మిన్ని అయ్యాడు. ధర్మ విషయంగా విదురుడు మూడు లోకాలలో శ్రేష్టుడుయ్యాడు. దృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కాబట్టి రాజు కాలేదు(ధృతరాష్ట్రస్య చక్ష్యుస్త్త్వాద్ రాజ్యం న ప్రత్యపద్యత). విదురుడు పారశవుడు కాబట్టి రాజ్యార్హత లేదు. పాండురాజుకు పట్టాభిషేకం చేయించాడు. విదురుని బుద్ధి బలంతో తన పరాక్రమంతో కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. గాంధారదేశ రాజకుమారి గాంధారి దృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు . గాంధారికి నూరుగురు పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి చెందుతుందని విదురుని అభిప్రాయం. పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని దృతరాష్ట్రునికి ఇమ్మని కోరాడు. గాంధార రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపక పోయినా సుబలుడు గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు. గాంధారి తండ్రి మాటిచ్చాడు కనుక ధృతరాష్ట్రుని భర్తగా ఎంచి అతనికి కళ్ళు లేవు కనుక తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. గాంధారరాజు సుబలుడు గాంధారిని ఆమె సోదరుడైన శకునిని హస్థినా పురానికి పంపాడు. భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం జరిపాడు. అదే సమయంలో భీష్ముడు గాంధారి పది మంది చెల్లెళ్ళతోనూ మరొక నూరు మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు. నూట పదకొండు మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల విద్యలలో ఆరి తేరాడు. వేదాలూ, శాస్త్రాలూ, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. భీష్ముడు పాండురాజుకు వివాహంచేయ నిశ్చయించుకున్నాడు
కుంతీ దేవి
యాదవ రాజైన శూరుడు తన కుమార్తె పృధను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునకు సంతానం లేని కారణంగా పెంచు కునేందుకు ఇచ్చాడు. ఒక రోజు కుంతి భోజుని ఇంటికి దుర్వాసుడు వచ్చి కొంత కాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని అన్నాడు. కోపిష్టి అయిన దుర్వాసునికి ఓర్పుగా సేవలు చేయడానికి కుంతి భోజుడు కుంతిని నియమించాడు. ఆమె అతి శ్రద్ధగా అతనిని సేవించింది. దుర్వాసుడు వెళుతూ కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర బలంతో కోరిన దేవతలు వచ్చి కుమారులను ఇవ్వగలరని చెప్పాడు. ఒక రోజు కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకు రాగా ఆ మంత్రాన్ని పరీక్షించాలని అనిపించింది. వెంటనే ఆమె మంత్రం పఠించి సూర్యుని పిలిచి దేవా నీవంటి కుమారుని ప్రసాదించు అని వేడుకుంది. కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమె తాను కన్యనని వారించినా వినక తన దర్శనం మంత్ర మహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యాత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచకుండలాలతో కుమారుని ప్రసాదించాడు. ఏమి చేయాలో తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి నదిపై తేలుతూ వచ్చింది. లోకోపవాదుకు భయపడిన కుంతి అమితమైన వేదనతో ఆ కుమారుని ఆ పేటికలో పెట్టి గంగా నదిలో ఒదలి వేసింది. సహజ కవచకుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అనే నామధేయం కలిగింది. నదిలో తేలుతూ పోతున్న ఆపేటిక ఒక సూతుని చేతిలో చిక్కింది అతనికి సంతానం లేని కారణంగా అతడు ఆ బాలుడిని భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు. బంగారము మణులతో దొరికినందు వలన అతనికి వశుషేణుడు (కర్ణుడు) అని పేరు పెట్టి పెంచు కుంటున్నారు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు