సుప్రభాత కవిత : బృంద
గిరుల పొత్తిళ్ల తొలినవ్వు చిలికి 
సిరులు కురియంగ నింగిని ఎదిగి
పసిడి మేఘాల పల్లకి ఎక్కి 
వెడలె విహారమునకు వెలుగురేడు!

కిరణాల కరవాలము ధరించి 
దిక్కులన్నీ వెలుగులు పంచి 
అవనిమీది అన్ని ప్రాణులకు
జీవచైతన్యమిచ్చు జీవనాడి!

కాల గమనమునకు కర్తయై 
గ్రహ సందోహమునకు రాజై
సర్వదేవతల ప్రతిరూపమై
సృష్టికితడే  సర్వ కర్మసాక్షి!

చీకటిని వెలి వేసి తరిమి
కనక కలశమందు కాంతిని
ధారగా కురిపించి కరుణతో
లోకాలనేలే సిరిజ్యోతి!

విరిసిన కోటి సుమాలతో 
వెదజల్లే మేటి పరిమళాల
తలయూచు ధరణి చేయు 
సుమార్చన చేకొను చెలికాడు!

విరాట్ పురుషుని చేతి 
స్వర్ణ కంకణము వోలె భాసించి
భవ్య సంపదలు చేకూర్చి
భువిని రక్షించు రశ్మిమంతునికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు