15 వ రోజు:భారత చక్రవర్తులు
అదితి కశ్యపుల పుత్రుడైన వివస్వతుని కుమారుడైన వైవస్వత మనువుకు చతుర్వర్ణాలు కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూద్రులు కలిగారు. చంద్రుడి కొడుకు బుధుడు. బుధుని కుమారుడు పురూరవుడు. అతడు ధనాశాపరుడై బ్రాహ్మణ ధనాన్ని అపహరించగా అది బ్రహ్మదేవునకు తెలిసి విషయం తెలుసుకుని రమ్మని సనత్కుమారాది మునులను పురూరవుని వద్దకు పంపాడు. పురూరవునిచే పరిహసించబడిన మునులు కోపించి పురూరవుని వెర్రివాడివి కమ్మని శపించారు. పురూరవుని భార్య ఊర్వశి అనే అప్సర. వారికి ఆరుగురు కుమారులు. వారిలో ఆయుషుడు అనే కుమారునికి కలిగిన నహుషుడు చక్రవర్తి అయ్యాడు. నహుషుని భార్య ప్రియంవద. వారి పుత్రుడు యయాతి. యయాతికి దేవయాని వలన ఇద్దరు కుమారులు కలిగారు. వృషపర్వుడనే రాక్షస రాజు కుమార్తె శర్మిష్ట వలన ముగ్గురు కుమారులు కలిగారు. శుకృని శాపం వలన యయాతికి ముసలి తనం వచ్చింది. యయాతి తన కుమారులను పిలిచి వారి యవ్వనాన్ని తనకు ఇమ్మని అడిగాడు. వారిలో పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి అతని ముసలితనాన్ని గ్రహించాడు. అప్పుడు జనమేజయుడు వైశంపాయినుని వద్ద ఒక సందేహం వెలిబుచ్చాడు. మహర్షీ క్షత్రియుడు చక్రవర్తీ అయిన యయాతి బ్రాహ్మణుడు రాక్షస గురువూ అయిన శుకృని కుమార్తెను ఎలా వివాహమాడాడు " అని అడిగాడు. సమాధానంగా వైశంపాయనుడు ఇలా చెప్పాడు.
కచ దేవయానుల వృత్తాంతం
వృషపర్వుడు అనే రాక్షస రాజుకు శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని. శుక్రాచార్యునికి మృతసంజీవిని తెలుసు. ఆ విద్యతో దేవాసుర యుద్ధంలో మరణించిన రాక్షసులను బ్రతికిస్తూ వచ్చాడు. అందు వలన రాక్షసబలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దేవతలు దేవగురువు కుమారుడైన కచుని వద్దకు వెళ్ళి అతనితో శుకృని వద్దకు వెళ్ళి అతని కుమార్తె దేవయాని అభిమానం సంపాదించి ఆమె ద్వారా మృతసంజీవని విద్య తెలుసుకు రమ్మని లేనియడల రాక్షసులను జయించుట కష్టమని అడిగారు. శుకృనికి దేవయాని మీద అత్యంత ప్రేమ కనుక ఇది సాధ్యం కాగలదని చెప్పారు. కచుడు సమ్మతించి శుకృని వద్దకు వెళ్ళి బృహస్పతి కుమారునిగా తనను తాను పరిచయం చేసుకుని శిష్యుడుగా చేరాడు. క్రమంగా కచుడు దేవయాని శుకృల అభిమానం చూరకొన్నాడు. అది మిగిలిన రాక్షస శిష్యులకు నచ్చక అతనిని అనేక యాతనలకు గురిచేసి చివరకు అతనిని చంపి బూడిద చేసి శుకృనికి మద్యంలో కలిపి ఇచ్చారు. దేవయాని ద్వారా అది తెలుసుకున్న శుకృడు ఆమె దిగులు పోగొట్టటానికి తన కడుపులోని కచునకు మృతసంజీవిని నేర్పాడు. కచుడు ఆవిద్యతో బయటకు వచ్చి తిరిగి శుకృని బ్రతికించాడు. కొంత కాలానికి కచుడు శుకృని వద్ద శలవు తీసుకుని తన లోకానికి పోయే సమయంలోదేవయాని అడ్డు వచ్చి అతనిని పోవద్దని తనను వివాహ మాడమని బ్రతిమాలింది. కచుడు గురుపుత్రి సోదరితో సమానం కనుక వివాహం పొసగదని చెప్పాడు. అందుకు కోపించిన దేవయాని తన దయతో సంపాదించిన మృతసంజీవని అతనికి పనిచేయకూడదని శపించింది. కచుడు అది తనకు ఉపయోగించక పోయినా తన వద్ద ఉపదేశం పొందిన వారికి పనిచేస్తుందని చెప్పి, తనకు కలిగిన శాపానికి ప్రతి శాపంగా దేవయానిని క్షత్రియుడు పెళ్ళాడతాడని చెప్పి తన లోకానికి వెళ్ళాడు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి