సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -33:-అండుకున్నమ్మకు ఒక్కటే కూర- అడుక్కునే దానికి అరవైయారు కూరలు
*****
"శెవ్వా! శెవ్వా! ఏం మడిసో ఏమో!ఉత్త సోకిరి మొగంది.ఇల్లు ఈవురం లేనే లెవ్వు.మొగుడికి పిల్లగాండ్లకు నోటికింత రుసిగ ఒండివార్సి పెట్టుకోవాలన్న సోవి,సొరంతి లేదాయె.అన్నం కూర ఒండేతల్కి అంబటేల దాటిపోబట్టె...మంచంల కూకోని గొణుక్కుంటన్న తిరుపమ్మ లోపలికి వత్తున్న అవ్వని జూసి... 
"రాబిడ్డా!రా! ఎన్నాళ్ళకెన్నాళ్ళకి నే మతికొచ్చిన.గిట్లొచ్చి గీ మంచెం పట్టెమీన కూకో!దా! పేమగ పిల్వంగనే మంచం పట్టె మీద కూసుంది.
ఇగ్గో శిన్నమ్మా! ఊళ్లె యాటని గోత్తె మీ యల్లుడు"ఆయాలు సాయాలు" దీస్కొచ్చిండు.గీ కూరొండుతుంటే నువ్వే యాదికొచ్చినవ్. పళ్ళు లేనిదానివి.గీ మెత్తటియి ఇట్టంగ తింటవని దెచ్చిన.ఇంతకి వద్నేది శిన్నమ్మా!" ఇల్లంత కలియజూస్కుంట అడిగింది.
"ఇంగో!బిడ్డా! గిప్పటి దాక అనేది దాన్నే. ఓఇల్లూ ఈవురం లేదు.ఒక్క అన్నం  కూర ఒండాడాన్కి ఆపసోపాలు పడ్తది. నాపేరు సెప్పి, ఇల్లిల్లూ తిరిగి కూరలు,తొక్కులు పట్కచ్చుకుంటన్నది.గట్ల జెయ్యడాన్కి దానికి సిగ్గెందుకు అనిపిత్తలేదో.. నాకైతే తల్కాయ కొట్టేశినట్టుందన్కో...
ఇగ్గో గీ నడ్మ కాళ్ళ నొప్పులు,నడ్ము నొప్పులు పాడుగాను నా ఎంటబడి పానం తీత్తున్నయే తల్లీ!పిసరంత గూడ నిల్వలేక పోతుంటి.నా శేతనైనంత కాలం జేసి పెడ్తె మారాణోలె కూకోని తిన్నది.తిన మరిగిన నోర్గద.గిప్పుడు వండ్క శాతగాక గట్ల జేస్తుంది."
అగ్గో! మాటల్ల రానే వత్తున్నది.గిట్ల నేనన్నని దాంతో ఏమన్కు బిడ్డ!కొంపల లేనిపోని లొల్లయితది.
"అవ్వా! బాగున్నవా! ఎంచేపయ్యింది వొచ్చి .ఇగ్గో అత్త నోరు సై దప్పిందంటె మనోళ్ళిల్లకు బొయ్యి గీ కూరలు అడక్కొత్తున్న"
అంటున్న మాణిక్కెం వొంక జూస్కుంట "అండుకున్నమ్మకు ఒక్క కూర-అడుక్కునే దానికి అరవైయారు కూరలు" అంటే గిదేనేమో"ఇల్లూ వాకిలి శేను శెల్క,పంట-గింట ఏం తక్వ లేని దీనికి గిదేం బుద్ధి- సుబ్బరంగా ఇట్టమైనవి జేస్కోని దినక "మన్సుల అన్పించింది అవ్వకి.
"అత్తా నీ కొంగు తొల్గిందన్నా తప్పే- తొల్గలేదన్నా తప్పే " ఎందుకొచ్చిన గోల"  పొయ్యొత్తనని ఇద్దర్కి జెప్పి ఇంటి మొగం బట్టింది.
 గదండీ సంగతి! అండుకున్నమ్మకు ఒక్క కూర-అడుక్కునే దానికి అరవైయారు కూరలు అంటే గిదే మరి.అడుక్కునే బిచ్చగాళ్ళను ఉద్దేశించి ఈ సామెత పుట్టింది.అది వాళ్ళ బతుకు విధానం. అందుకే గాళ్ళలో కొందరు ఇంటిముంద్కి రాంగనే అయ్యో పాపం అన్పిస్తది"లేందైతే ఎవ్వరికైనా పాపమన్పిచ్చి పెట్టబుద్దైద్ది.
గసుమంటి అడుక్కునే దానికి దీనికి పోలికేడన్న వున్నదా ?ఉన్నయి గిట్ల పాడు చేసుకోవద్దని జేస్తే ఏమన్న బాగుంటదా? మీరే జెప్పుండ్రి.".

కామెంట్‌లు