వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి చేరినారు అంతా. పల్లెటూరిలో రకరకాల ఆటలు ఆడుకునే అవకాశం ఉంది. పల్లె ఒడిలో ఆడుతూ పాడుతూ గడిపే అవకాశం ఉంది. మేనమామ మహేంద్ర పిల్లలతో ఇలా చెప్పాడు. "ఈ సెలవులను రకరకాల ఆటపాటలతో, కథలూ కళలతో తనివి తీరా పండుగ చేసుకోండి. కానీ టీవీలు, సెల్ ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టండి..ఆట అంటే కేవలం క్రికెటే ప్రపంచం అయింది. క్రికెట్ పూర్తిగా పక్కన పెట్టి, వినోదాన్ని పంచే ఆటలు ఆడుకోండి." అన్నాడు. అయినా మన మూర్ఖులు కొంతమంది వింటారా? మామయ్య చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినారు.
"మామయ్యా! నాకు ఏమీ తోచడం లేదు. అందరూ క్రికెట్ ఆడటానికి పోయారు." అన్నది లీల. "నాదీ అదే పరిస్థితి. ఎంతసేపూ ఇద్దరమే ఏమి ఆడతాం చెప్పు." అన్నది సుశీల. ఇంటికి వచ్చిన పిల్లలను బతిమాలిననాడు మామయ్య క్రికెట్ తప్ప వేరే ఆటలు ఆడుకోమని. మరునాడు షరా మామూలే. ఆ రోజు రాత్రి కఠినంగా మందలించాడు. కానీ కుక్క తోక వంకర సరి చేయడం అసాధ్యం కదా! రెండు మూడు రోజులు చూశాడు మామయ్య. మనవాళ్ళు మానలేదు.
మహేంద్ర తన కోడళ్ళను తీసుకుని పిల్లలంతా క్రికెట్ ఆడే మైదానానికి తీసుకెళ్ళాడు. పిల్లలు ఊరి పిల్లలతో కలసి క్రికెట్ ఆడుతున్నారు. అటుగా వచ్చిన మామయ్యను చూసి ఏమాత్రం కంగారు పడలేదు. "వచ్చాడు మామయ్య. మనతో ఆడటానికి." అన్నాడు రాఘవ. "ఏమి ఆడతాడు మన మామయ్య. క్రికెట్ అంటే ఇష్టం ఉండదు కదా!" అన్నాడు రాము. "అసలు మన మామయ్యకు క్రికెట్ వస్తే కదా! మనతో ఆడటానికి తనకు అస్సలు ఆ ఆట రాదు. మామయ్యకు అసలు బ్యాట్ పట్టుకోవడమే రాదు. నేను కనుక బౌలింగ్ చేస్తే మామయ్య డకౌట్ అవుతాడు." అంటూ పగలబడి హేళనగా నవ్వడు వాసు. ఆ ఊరి వారు కూడా పగలబడి నవ్వారు. "మీ మామయ్య బౌలింగ్ చేస్తే మనమంతా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టవచ్చు రా." అన్నాడు రంగ. రంగ తన అల్లుడు కాదు. బంధువు కాదు. ఆ ఊరి వాడు. రంగ అన్న మాటలకు కూడా పగలబడి నవ్వారు అంతా.
మహేంద్రకు పౌరుషం వచ్చింది. క్రికెట్ బ్యాట్ చేతిలోకి తీసుకొని వాసును బౌలింగ్ చేయమన్నాడు. వాసు బౌలింగులో మహేంద్ర సిక్సర్ల మీద సిక్సర్లు బాదినాడు. ఆశ్చర్యపోయారు అంతా. వాసు టీంను బ్యటింగ్ చేయమని మహేంద్ర బౌలింగ్ మొదలు పెట్టినాడు. ఆరు బంతుల్లొ ఆరుగురిని ఔట్ చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ మహేంద్రను అభినందించారు. మరునాడు వాసు మహేంద్ర దగ్గరకు వచ్చి, "క్రికెట్ ఆడుదాం రా మామయ్యా!" అని పిలిచాడు. మామయ్య ఏమీ మాట్లాడలేదు. అందరితోనూ మాటలు మానేశాడు. కోడళ్ళతో కలసి ఇంట్లోనే రకరకాల ఆటలు ఆడటం మొదలుపెట్టాడు మహేంద్ర. కథలూ కబుర్లతో కాలక్షేపం చేశాడు. క్రమంగా క్రికెట్ ఆడే బృందంలో ఒక్కొక్కరూ క్రికెట్ మానేసి ఇంట్లోనే మామయ్యతో, చెల్లళ్ళతో ఆడుకుంటున్నారు. చివరకు వాసు ఒంటరి వాడయ్యాడు. వాసు ఒక్కడే క్రికెట్ ఆడటానికి వెళ్ళాడు. కానీ వాసు మనసంతా బాధ బాధగా ఉంది. సరిగా ఆడలేకపోతున్నాడు. చివరికి వాసూ కూడా మామయ్యను క్షమించమని కోరి ఇంట్లోనే ఆటలు ఆడుతున్నాడు. ఇక ఎప్పుడూ క్రికెట్ జోలికి వెళ్ళవద్దని అనుకున్నాడు.
ఆట : -సరికొండ శ్రీనివాసరాజు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి