కవితా ప్రవాహం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరాల నదిలో
ఆవిర్భవించే ప్రవాహం 
భావాల కడలితీరం చేరే
మహాగమ్యమే కవిత్వం

తరంగాల మేళంలో
మెరుపులు చిమ్ముతూ
ముత్యాలు చిందిస్తూ
మాటలు సాగించటమే కవిత్వం

కలం పడితే
కదిలే గాలిలా
పదం పుడితే
పూసే పువ్వులా చిందే పరిమళమే కవిత్వం

ప్రతి అక్షరమూ
ఒక తేపు తరంగం
ప్రతి భావమూ
ఒక ఊపు మధురగీతం

పదాల మధ్య
మెరిసే ప్రకాశం
అదే హృదాయాలందు
కవిత్వ దీపం

కాలం మబ్బుల్లో
కమ్ముకున్న మౌనం
కవిత్వ స్వరంతో 
లేచేదే పౌనపున్యం

జీవిత పుటల్లో
రాసిన ప్రతి వాక్యం
మనసుల్లో మారే
చైతన్య సాకారమే కవిత్వం

సమాజం గుండెల్లో
చిగురించే చిహ్నం
భావజాలం మధ్యలో
మెరిసే జ్యోతియే కవిత్వం

కవిత్వం
సత్యం చెబుతుంది స్నేహంతో
నిజం చూపిస్తుంది 
నీతి మాధుర్యంతో

ఆలోచనల అరణ్యంలో
జనించే వాక్యాలు
అనుభూతుల ఆకాశంలో 
ఎగిరే గాలిపటాలే కవిత్వం

కవికలం తడిపితే
వెలువడే కాంతి
హృదయాల్లో వెలిగే
అమృత జ్యోతి కవిత్వం

ప్రేరణ, ప్రవాహం
పూర్వజన్మ పుణ్యం
పద సముద్రంలో
ఈతకొట్టే కలల సత్యమే కవిత్వం

కవిత్వం
జీవనానికి ఆత్మగానం
అక్షరాలే
చేయిస్తాయి ఆత్మయానం

కవిత్వం
చకచకా పారుతుండాలి
కళకళా వెలుగుతుండాలి
గణగణా మ్రోగుతుండాలి


కామెంట్‌లు