శ్రీశ్రీ కళావేదిక రాజాం నియోజకవర్గం అధ్యక్షునిగా ప్రముఖ రచయిత, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావును ఎంపిక చేసినట్లు శ్రీశ్రీ కళావేదిక ఉత్తరాంధ్ర అధ్యక్షులు డా.డబ్బీరు గోవిందరావు ప్రకటించారు. శ్రీకాకుళంలో జిల్లా కేంద్ర గ్రంధాలయ ఆవరణలో జరిగిన జిల్లా శాఖ సమావేశంలో తిరుమలరావును ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా శాఖ కన్వీనర్ బోగెల ఉమామహేశ్వరరావు, జిల్లా శాఖ అధ్యక్షులు మణిపాత్రుని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి.గోవిందరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి వాడాడ శ్రీనివాసరావు తదితరులు తిరుమలరావును సభకు పరిచయం చేసారు. ఈసందర్భంగా తిరుమలరావుకు శ్రీశ్రీ కళావేదిక సభ్యత్వ ధృవీకరణ పత్రాన్ని గోవిందరావు చేతులమీదుగా బహూకరించారు. గోవిందరావు మాట్లాడుతూ తిరుమలరావు గత మూడున్నర దశాబ్దాలుగా కవితలు కథలు వ్యాసాలు రచిస్తున్నారని, ఎన్నో పత్రికల్లో సంకలనాల్లో ఆయన రచనలు ప్రచురితమైనాయని, స్వయంగా కొన్ని సంపుటి లను కూడా విడుదల చేసారని, పలుసార్లు సాహిత్య పోటీలలో విజేతగా నిలిచారని, ఎన్నో సాహిత్య పురస్కారాలు పొందారని కొనియాడారు. అందుకే ఆయనను రాజాం నియోజకవర్గం అధ్యక్షునిగా ఎంపిక చేసామని వివరించారు. జిల్లా కన్వీనర్ బోగెల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తిరుమలరావు హాజరైన సభలలో స్వీయగీతాలను కూడా ఆలపించి సభాసదులను రంజింపజేస్తారని గుర్తుచేసారు.
జిల్లా అధ్యక్షులు మణిపాత్రుని నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజాం రచయితల వేదిక సభ్యునిగా, ఉత్తరాంధ్ర రచయితల వేదిక సభ్యునిగా, బొబ్బిలి రచనా సమాఖ్య సభ్యునిగా, కొత్తూరు రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షునిగా, తెరవే, యురవే విశ్వసాహితీ కళావేదికల సభ్యునిగా వ్యవహరిస్తూ సాహిత్య రంగంలో మిక్కిలి కృషి సల్పీ మంచి కవిగా రాణిస్తున్న తిరుమలరావును నేడు శ్రీశ్రీ కళావేదిక రాజాం నియోజకవర్గ అధ్యక్షునిగా స్వాగతిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి వాడాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరుమలరావు బెంగుళూరులో తెలుగు తేజం అవార్డును, హైదరాబాద్ తెలుగు కళా వైభవం సంస్థ నుండి సహస్రకవిమిత్ర బిరుదాంకిత పురస్కారాన్ని, అలా వందకు పైగా పురస్కార సత్కారాలను అందుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలలో వందకు పైబడి ఊళ్ళతో పాటు హైదరాబాద్, బెంగుళూరు, యాదాద్రి, అంతర్వేది, కరీంనగర్, ఒంగోలు, అనంతపురం, భద్రాచలం, శ్రీకాళహస్తి, ప్రొద్దుటూరు, మొదలగు ప్రదేశాలలో తిరుమలరావు తన కవితా గానం వినిపించి, సదస్యుల అభినందనలు పొంది, ఘన సన్మానాలు, పురస్కారాలు, పొందియున్నారని అన్నారు. కుదమ తిరుమలరావు మాట్లాడుతూ 36ప్రపంచ రికార్డులు సాధించి, ఐ.ఎస్.ఓ.గుర్తింపునొంది, నిరంతర సాహిత్య సాంస్కృతిక ప్రభంజనంగా ఇప్పటికి 156 సభలను నిర్వహించిన అంతర్జాతీయ సంస్థ అయిన శ్రీశ్రీ కళావేదికలో తనను చేర్చుకుని బాధ్యతలు అప్పగించినందుకు మిక్కిలి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
ఇకపై జరిగే శ్రీశ్రీ కళావేదిక కార్యక్రమాల అభ్యున్నతికి మరింతగా తనవంతు కృషి చేస్తానని తిరుమలరావు అన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి