సామెతల ఊట- సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు. ఖమ్మం

 సామెత -27: అమ్మ పెట్టదు - అడుక్కు తిననివ్వదు

*****
శెవ్వా! గాపొల్లగాండ్లేం పొల్లగాండ్లే అవ్వా!గస్మంటి పొల్లగాండ్లను నాజల్మల సూడ్లేదంటే నమ్ము!బుగ్గలు నొక్కుకుంట జెప్తున్న జమాల్ బీ వొంక జూస్కుంట...
"మా బుడ్డోడు భూలచ్మి నా ఏంది శెల్లె ?" అనుమానంగా అడుగుతుంటే...
"అయ్యయ్యో! గంత మాటంటివేందవ్వా! గాళ్ళకి గీళ్ళకి "నక్కకూ నాగలోకాని కున్నంత ఫరకుంది."
ఇంతకీ ఎవలాని ఆలోచన్ల బడ్డ అవ్వని జూసి "గదేనవ్వా!మా ఇంటి పక్క నాంచారి పొల్లగాండ్లు.గాల్లే."పరమ లేకి, బూకరోళ్ళు."మొన్న జాతర్కి బొయ్యిన్నాడు చిల్కలు బత్తీసలు తెచ్చిన్నా! గవ్వి మా మన్వడు బల్లెకొద్దుర అన్న సుత దీస్కపోయిండు. దోస్తులకి ఇస్తుంటె నాంచారి కొడ్కు,బిడ్డ జూసిర్రట.అడ్గంగనె చెరోటి ఇచ్చిండట.తిని మస్తుగున్నయ్ గిసంటివి ఇంకియ్యమని మల్ల మల్ల ఒకటే అడ్గుడట.రేపు దెస్తతీ  అని ఇయ్యాల కొంటబోతుంటే తెల్సి మావోడ్ని జమిడికేసుకున్న.అయిన ఇన్లే దీస్కబోయిండు."
అవున్గని పొల్లగాండ్లని పెంచే తరీక గదేనా అవ్వా! అంటుండంగనె మాట్లాడు బడ్నుంచి వస్తొత్తూ  జమాల్ బీని ఎతుక్కుంట ఉర్రికొచ్చిండు. 
"దాదీ! దాదీ! ఇగ్గో!నువ్విచ్చిన చిలుకల్,బత్తీసలు.నిన్నిచ్చిన దోస్తుగాళ్ళకు యియ్యబోతె ఏడ్సుకుంట వద్దన్నరు.గాళ్ళమ్మ నిన్న ఆళ్ళని పొట్టు పొట్టు గొట్టిందంట. ఇగ్గో గీ పైసల్ సుత నాకియ్యమని పంపిచ్చిందంట" ఒగుర్సుకుంట చెబ్తున్న అంతట్లనే  భూలచ్మి బుడ్డోడు వొచ్చిండ్రు.
"అవునవ్వా! పాపం మేం గాళ్ళ ఈపుల ఆతలు సుత జూసినం." అన్నరు.
"అమ్మా పెట్టదు -అడుక్కు తిననివ్వదు" అంటే గిదేనే. గా పొల్లగాండ్లను తొందరపడి"లేకి బూకరి"అని తిడ్తివి శెల్లె.
 అసలే నాంచారి, దాని మొగుడు ఇద్దరికిద్దరే.మా పీనాశోల్లు."ఏం కూర జేసినవని ఎప్పుడడిగిన మాడ్శిన కారం,చింతకాయ తొక్కు,సల్ల ముచ్చటే జెప్తది.ఒక్కనాడన్న మంచి కూర నార జెయ్యడం ఇన్లే.ఇంగ దాని మొగుడైతే ఎప్పుడు జూడు లేమిడోని లెక్కనే గన్పడతడు.
"గాళ్ళెపొల్లగాండ్లెట్లున్నరో నువ్వు జూస్తివి గద. అసల గీ యీడ్ల ఎట్లుండాలె.ఉఫ్ఫంటే గాల్లో ఎగిరి పోయేట్టున్నరు."పైసకి పది ముల్లేసుడు దెల్సుగని - కడ్పున బుట్టినోళ్ళను మంచిగ జూస్కునుడు దెల్వదాయె".
 గా పిల్లగాండ్ల మీద నోర్జారినందుకు చాంద్ బీ నారాజ్ పడ్కుంట మన్వడిని దీస్కొని అక్కడ్నించి కదిలింది.
గదంత ఇన్న భూలచ్మి, బుడ్డోడు "అమ్మ పెట్టదు -అడుక్కు తిననివ్వదు" అంటే గిదేనా అవ్వా! అన్నరు.
"అవున్రా!గిట్లనే ఎవలికైన ఆపదొత్తె కొంత మంది సూత్తుంటర్గని సీమ కాలంత సాయం జెయ్యరు.చేసేటోళ్ళకు ఆళ్ళ సొమ్ము బొయినట్లు అడ్డుపడ్తరు.గసంటోళ్ళ మీద పద్దేలు సుత ఉన్నయ్.పెద్దయినంక గివన్ని మీకే తెలుస్తయి"అన్కుంట..
 "తానాలు జేసిరాండి ఏడి ఏడి శనగ్గూడాలు" పెడ్తనంగనే సంబురంగ కదిలిండ్రిద్దరు.
 
గదండీ సంగతి! "అమ్మ పెట్టదు -అడుక్కు తిననివ్వదు" అంటే గిదే మరి.

కామెంట్‌లు