కవితా మాధుర్యాలు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
అక్షరాల తేనెలో
తెలే తీయని విషయము -
మదులను తట్టే
మధుర స్వర ప్రవాహము.

పదాల పూదోటలో
వెలువడే పరిమళం -
భావాల వెన్నెలలో
వెలిగేటి కాంతి సుమం.

కలము కార్చే
కమ్మని అమృత ధారలు -
ప్రతి పంక్తిలో కురిసే 
ప్రేమ సుగంధ జల్లులు.

లయలో సాగే
లాలిత్య స్రవంతులు -
మనసును తాకే
మధుర కాంతులు.

రమ్య రూపకాలు 
రంగుల రేఖలు -
రసాలు, రాగాలు
మిక్కిలి సోయగాలు.

పాడిన కవితతో
ప్రతిసారి జనించు -
శ్రోతల మదుల్లో
అమిత ఆనందాలు.

పలుకులు పూలై విప్పారితే
వెదజల్లు పరిమళాలు -
ప్రతి పంక్తి వెలుగైతే
విరజిమ్ము తళుకుబెళుకులు

మౌనం ఆవరిస్తే
కవిత గుప్పిస్తుంది మాటలు -
చెవులు కోరితే
మనసు పాడిస్తుంది మధురగీతాలు.

అక్షరమే ఆభరణము 
భావమే ప్రధానము -
మనసుకు కవితలే 
అమృత భాండాగారము.

కవితా మాధుర్యాలు
పారించు సౌరభాలు - 
చదువరుల హృదయాలు 
స్వీకరించు సుగంధాలు -


కామెంట్‌లు