సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము- షష్టమాశ్వాసము-* 32వ రోజు*
పాండుసుతులు వారణావతానికి వెళ్ళుట లక్కాగృహ దహనం
తండ్రి అనుమతి తీసుకుని దుర్యోధనుడు తన కపటోపాయం అమలులో పెట్టాడు. ముందుగా కొందరు మంత్రులను పంపి పాండవులకు వారణావతం గురించి ఆసక్తి కలిగేలా చెప్పించాడు. గొప్పగా వర్ణించిన వారణావతం చూడాలన్న కుతూహలం పాండవులలో కలిగింది. ఒకరోజు దృతరాష్ట్రుడు పాండవులను పిలిచి "నాయనా ధర్మరాజా నీతండ్రి పాండురాజు గొప్ప కీర్తి గడించాడు. కాలవశాత్తు ఆయన ఇప్పుడు లేనప్పటికీ నీవు మీ తమ్ములు తండ్రికి తగిన తనయులు. ఇంత కాలం రాజ్యభారాన్ని మోసి అలసి పోయారు కనుక వారణా వతంలో మీ తల్లితో కొంతకాలం విశ్రాంతి తీసుకుని రండి. గంగా తీరాన ఉన్న ఆనగరం అత్యంత సుఖప్రథమైన నగరం అని విన్నాను. నా మాట కాదనరు కనుక నేనిది చెప్తున్నాను " అన్నాడు. పెద్ద తండ్రి ప్రేమతో చెప్పిన మాటను తిరస్కరించ లేక ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృపాచారుల ఆశీర్వాదం తీసుకుని తల్లిని, తమ్ములను వెంట పెట్టుకుని వారణావతం బయలుదేరాడు. ఇది చూసిన దుర్యోధనుడు ఆనంద పడ్డాడు. పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుని పిలిచి వారణావతంలో పాండవుల కొరకు లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో చేసిన గృహాలను నిర్మించి వాటిలో పాండవులు ఏమరుపాటుగా ఉన్న సమయం చూసి ఆగృహాలను తగులపెట్టు. వారి మరణ వార్త తీసుకువస్తే నీవు జీవితాంతం భోగాలను అనుభవించ వచ్చు. అని అతనిని ప్రలోభ పెట్టాడు. పురోచనుడు అందుకు అంగీకరించాడు. పాండవులు శతశృంగం నుండి వచ్చే సమయానికి వారి వయసు వరుసగా 16, 15, 14, 13, 13 సంవత్సరములు. అని ఇక్కడ ప్రస్తావించబడింది. ఆ తరువాత వారు 13 సంవత్సరములు ఉన్నారు. వారణావతానికి వెళ్ళే సమయంలో వారి వయసు వరుసగా 29, 28, 26, 25, 25 సంవత్సరాలు. తల్లితో సహా వారణావతానికి బయలు దేరుతున్న పాండవులను చూసి పౌరులు పాండవుల అడ్డు తొలగించు కోవాలని వారిని వారణావతానికి పంపుతున్నారని గ్రహించారు. భీష్ముడు మొదలైన వారు అడ్డు చెప్ప నందుకు కలత చెందారు. పాండవులు లేని రాజ్యంలో ఉండలేమని భావించి వారి వెంట నడవ సాగారు. వారితో ధర్మరాజు పెదనాన కోరిక మీద వెళుతున్నామని తిరిగి రాగలమని నచ్చ చెప్పి వారిని మరలించాడు. విదురుడు మాత్రం మరికొంత దూరం వారి వెంట వెళ్ళి నర్మగర్భంగా కొన్ని మాటలు చెప్పాడు. తరువాత కుంతీ దేవి వద్ద శెలవు తీసుకుని మరలి వెళ్ళాడు. విదురుని మాటలు అర్ధం కాని కుంతీ దేవి విదురుడు ఏమి చెప్పాడు అని ధర్మరాజుని అడిగింది. ధర్మరాజు తల్లితో " అమ్మా విషాగ్నుల వలన అపకారం జరుగవచ్చని అప్రమత్తంగా ఉండమని చెప్పాడు. దుర్యోధనుని వెంట ఉండి అతను మనకు అపకారం తలపెడితే మనకు తెలియ చేస్తానని చెప్పాడు " అన్నాడు. విదురుని ప్రేమకు కుంతీతో సహా అందరూ ఆనందించారు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు