సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!

 ఆది పర్వము పంచమాశ్వాసము:-25వ రోజు
పాండవ కౌరవ జననం
పాండురాజు ఆవేదనకు విచలిత అయిన కుంతీ దేవి పాండురాజుకు తనకు దుర్వాసముని ఇచ్చిన వరం గురించి చెప్పింది. కాని కర్ణుని జననం తప్ప అంతా వివరించింది. కుంతి ఆ మంత్ర సాయంతో సంతానం కలుగుతుంది కనుక ఏదేవత సాయంతో సంతానం పొందాలో ఆనతివ్వమని పాండురాజుని అడిగింది. పాండురాజు ధర్మదేవతకు మించిన దైవం లేదు కనుక అతనిని స్మరించి పుత్రుని పొందుము . అలా భర్తచేత నియోగించబడిన కుంతి యమధర్మరాజుని స్మరించి కుమారుని కన్నది. అతనికి యుధిష్టురుడు అని నామకరణం చేసాడు. ఋషులు అతను కురు వంశానికి రాజై ధర్మ బద్దంగా రాజ్యం చేస్తాడు అని పలికారు. హస్థినలో గాంధారి కుంతిదేవి కంటే ముందే గర్భం ధరించినా ముందుగా ప్రసవించ లేక పోవడంతో అసూయ చెంది తన గర్భాన్ని కొట్టుకుంది. అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది విని వ్యాసుడు అక్కడకు వచ్చి ఆ మాసం ముక్కలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి నూరుగురు పుత్రులు ఒక కుమార్తె కలుగుతుందని చెప్పాడు. పాండురాజుకు మరొక కుమారుడు కావాలని కోరిక కలిగి వాయుదేవుని సాయంతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతి వాయుదేవుని సాయంతో కుమారుని పొందింది. ఆకాశవాణి ఆ కుమారునికి భీమసేనుడు అని నామకరణం చేసింది. హస్థినాపురంలో గాంధారికి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. ఒక్కోరోజుకు ఒక్కో కుమారుడు కలిగారు. నూరుగురు కుమారులు జన్మించిన తరువాత దుస్సల అనే కుమార్తె జన్మించింది. దుర్యోధనుని జనం తరువాత గోచరించిన దుశ్శకునాలను చూసిన భీష్మ, విదుర, పురోహితాదులు కలత చెంది అతడు కులక్షయ కారకుడని అతనిని వదిలి వేసి అందర్ని రక్షించమని మిగిలిన కుమారులను పెంచుకోమని చెప్పారు. కానీ పుత్రుని మీద మమకారంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వదలడానికి అనుమతించలేదు.
భీముని బలం
కుంతీ దేవి ఒకసారి భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళుతున్న తరుణంలో ఒక పులి ఆమె మీదకు ఉరికింది.పాండురాజు దానిని చంపేలోగాకుంతీ భీముని ఒక బండరాతిపై జారవిడిచింది కేవలం పది రోజుల శిశువు పడగానే ఆ రాళ్ళు పొడి పొడి అయ్యాయి. భీముని బలానికి పాండురాజు ఆశ్చర్య పడ్డాడు. దృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు కలిగారని విని పాండురాజుకు కూడా ఇంకొక కుమారుడు కావాలని కోరిక కలిగింది. అతడు దేవేంద్రుని గురించి తపసు చేసాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించ కలిగిన కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. కుంతీ దేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని అంశతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతీ దేవికి ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో తేజోవంతుడైన పుత్రుడు కలిగాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతను కార్తవవీరార్జ్యునికంటే వీరుడౌతాడు. కనుక అర్జునుడని పిలువబడుతాడు " అని పలికింది. కుంతీదేవి గాంధారి సంతాన వతులైన తరువాత మాద్రి సంతానం కొరకు చింతించడం చూసి పాండురాజు మంత్ర మహిమ ద్వారా మాద్రికి సంతానం కలిగించమని అడిగాడు. కుంతీ మాద్రికి మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్వినీ దేవతల అంశతో నకులసహదేవులను పొందింది.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు