సామెత -10; అచ్చోసిన ఆబోతు/ ఆంబోతు
*****
అవ్వా! అవ్వా! గిదిన్నవా? నాంచారమ్మత్త బిడ్డ నవ్య,కోటమ్మొదిన శెల్లె కోమలి, రంగమ్మ నాయనమ్మ మనువరాలు రమణి...గీళ్ళు ముగ్గురు బడికెళ్ళమని మొండికేత్తున్నరంట.ఎందుకంటే మూగిమొద్దుల్లా ఉలుకూపలుకు లేకుండా తలకాయలు వాల్చేత్తుండ్రంట.ఆ మూడిండ్లోళ్ళు పొల్లగాండ్లకు గాలేమన్న సోకిందేమో అనుకుంటుండ్రు. దినాం ముగ్గురు నడ్సుకుంట పక్కూళ్ళో పది సదివేందుకు ఎళ్ళేటోళ్ళు. నయాన బయాన ఎట్లడిగినా తలకాయలు అడ్డంగా నిలుగ్గా ఊపుడే తప్ప నోరిప్పడం లేదంట." సంగతంతా ఎళ్ళగక్కి అవ్వేం జెపుతదోనని నోటొంక సూడబట్టింది చంద్రమ్మ .
ఎందుకనో మరి కూసింత కూపీ లాగక పోయినవ్ చంద్రా !సక్కగ సదూకునే బిడ్డలు.ఎవ్వల జోలికి పోయేటోళ్ళు గాదు. ఆణిముత్తాలని ఊళ్ళే అందరూ అనుకునే గాళ్ళు ఎందుకట్ల చేత్తుండ్రో నీకు తెలియదా! అనంగనే "అమ్మో! అందరు"ఆవులిత్తె పేగులు లెక్కబెట్టోళ్ళయితే" గీ అవ్వ ఆవులించకుండనే పేగులు లెక్క బెడ్తది."
తడబడుకుంట ఆఁ ఆఁ తెలుసవ్వా! గుసగుసగా గొంతు తగ్గించి గా పెద్దిరెడ్డి కొడుకు లేడు గాడు గాని తొట్టి గాంగ్ పోరలే ఏదో బెదిరిచ్చి ఉంటరని, ఎవలికి వాళ్ళే సాటుమాటుగ సెవులు కొరుక్కుంటుండ్రు. అయ్య వో పెద్ద రౌడీ,కొడుకో సిన్న రౌడి. గాళ్ళంటే ఊళ్ళె చానామందికి చచ్చేంత బయ్యం."అచ్చోసిన ఆంబోతుల్లా" తిరిగే గా పులుల నోట్లో తలకాయ దూర్సడం ఎందుకని ఆ పొల్లల ఇంటోళ్ళు సదువు మానిపిచ్చుదాం అనుకుంటుండ్రంట".అసలు సంగతి జెప్పి కడుపుబ్బరం తగ్గించుకుంది.
" కాదే చంద్రా! అతి రహస్సం చెవులో పోటని అందరికీ యిషయం తెలుసు గంద.ఇంగ బయ్యమెందుకు? ... ఏమో అవ్వా! గోడలకు చెవులుంటయ్! ఆళ్ళ జోలి తేవొద్దని,పోవద్దని మా ఆయన ముందరి కాళ్ళకు బంధమేసిండు.గందుకే గిట్ల.
సరెగని గా ముగ్గురిని మూడో కంటికి తెల్వకుండ నా తానకు దీస్కరా! మిగతాది నేజూస్కుంట. నచ్చజెప్పి పంపింది.
గంతే మూడోరోజు నుంచి ముసిముసిగా నవ్వుకుంట ముగ్గురు దోస్తురాళ్ళు బడికి పోతుంటే ఊళ్ళె అందరూ ముక్కున వేలేసుకుని అబ్బుర పడ్డరు. గప్పుడు గూడా గింత మార్పెట్లొచ్చిందని అడిగితే ఒక్కటే కుతికతో "ఏమో మాకేం దెల్సు. ధైర్నం వొచ్చింది ఎళ్తున్నం గంతే" అన్నరంట. "ఆర్నీ పొల్లలకు గింత దైర్నం ఎట్లొచ్చిందబ్బా! అనుకుంట ..గీ ముచ్చట దీసుకొచ్చి అవ్వకు సంబురంగా జెప్పి ,ఆవలిత్తే అవ్వ పేగులు లెక్క బెడదాం అనుకున్న చంద్రమ్మకు "అవునా! చంద్రా! అని సప్పుడుజేకుండ ఉండే తల్కి ఇంగేం మాట్లాడాల్నో తెల్వక ఎల్లిపోయింది.
పెదవి దాటితే పృథివి దాటుతుందని అవ్వకు మాబాగా దెల్సు.గందుకే చంద్రమ్మ ముందు బయట బడలె.తన సుట్టపోళ్ళ పిల్ల షీటీంల పనిజేస్తుందని గామెతోనే ముగ్గురికి ఏం జేయాలో ధైర్నం జెప్పించిందనీ, గాళ్ళను చిడాయించిన గా పెద్ది రెడ్డి కొడుకు గ్యాంగును టేషనుకు తీస్కబోయి మక్కెలిరగ్గొట్టి పంపిందనీ, గా పెద్ది "చెప్పుకుంటే పరువు బాయె చెప్పకుంటే మానం బాయె" అన్నట్టు నోరు మూసుకుని ఉండన్న సంగతి" మూడో కంటికి తెల్వకుండ కత నడిపించింది అవ్వ.
గదండీ సంగతి. "అచ్చోసిన ఆబోతు/ ఆంబోతు అంటే పల్లెల్లో కొందరు రైతులు, పెద్దలు కలిసి ఓ కోడె దూడను దేవుని పేరు మీద వదులుతారు. దానిని సాక్షాత్తు దైవం లెక్క జూస్తరు. అచ్చు అంటే అది దేవుని కోడె అని తెల్వడానికి ఒంటి మీద రెండు ముద్దెర్లు/ శంఖు చక్రాల అచ్చులు వేస్తారు. దానిని ఎవరూ ఏమీ అనరు కాబట్టి ఊరే కాదు,పంట పొలాల్లో కూడా ఎదేచ్ఛగ తిరుగుతుంది.అది పశువు గాబట్టి చెల్లుతుంది.మడిసి గట్ల జేస్తే ఏమన్న బాగుంటదా?అందుకే మరి ఏ హద్దూ పద్దూ లేకుండా అవారాగా తిరిగేటోడిని గిట్ల "అచ్చోసిన ఆబోతు" అంటారు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి