సినిమా చూపిస్తా మామ: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

 మొదటి ఆట పడకముందే భారీగా దోచేయాలి.
స్పెషల్ షోల పేరిట స్వేచ్ఛగా,
బెనిఫిట్ షోల పేరిట బరితెగించి,
ప్రేక్షకుల నడ్డి విరచాలి.
సాటిలైటు హక్కుల నమ్ముకొని
భద్రంగా ఉండాలి.
ఎగ్జిబిటర్లు,బయ్యర్లందరూ
కలిసి ముందస్తుగానే ముంచెయ్యాలి.
హీరోల కళ్ళలో ఆనందానికై 
కోట్లు కుమ్మరింపజేయాలి.
మొదటి పడే సమయానికి టిక్కెట్ల రేట్లు ఇష్టమొచ్చిమట్లు పెంచుకుంటూ,
ప్రేక్షకుల ఉసురు తీసెయ్యాలి.
ప్రేక్షకుల జేబులకు చిల్లే కాదు,
జేబే మాయం చెయ్యాలి.
వేలం వెర్రిలో మేమంటే మేమే 
ఫస్టు అని‌ ఊదరగొట్టాలి.
మొదటి ఆట పడకముందే
మైండ్ గేమ్ మొదలెట్టాలి.
గ్రాసులు,షేరుల రూపంలో కలెక్షన్ల సునామీ సృష్టించాలి.
అభిమానుల అంతు చూసెయ్యాలి.
త్రిశంకు స్వర్గాన నిలబెట్టి,
చావనీయకూడదు,బ్రతకనీయకూడదు.
రివ్యూల పేరిట మసిపూసి మారేడుకాయ చేసేయ్యాలి.
వ్యాపారంలో విలువలకు తిలోదకాలిచ్చి,
విశృంఖల విహారం చేసేయ్యాలి.
ఖర్మ కాలి ఎవరైనా చస్తే,
మొసలికన్నీరు కారుస్తూ,
డీల్ కుదుర్చుకోవాలి.
నయన వ్యభిచారానికంతా యు సర్టిఫికెట్ వచ్చేటట్లు నటించేయాలి.
సక్సెస్ మీట్లతో జనాన్ని ఏమార్చి,
అందినకాడికి దోచేయాలి.
నీ వాటా నీదే,నా వాట నాదే,
ఆలస్యం అమృతం విషమన్నట్లు,
మొదటి ఆట పడకముందే
అంతా కానిచ్చేయాలి.
ప్రేక్షకుడిని రాయిని చేసి కూర్చోబెట్టాలి.
ఫిల్మ్ గోయర్సును బకరాలను చేసి,
బావర్చీ బిర్యానీలు లాగించేయాలి.
మల్టిఫ్లెక్సుల మాయాజాలంతో
నిలువుదోపిడి చేసేయాలి.
మొదటి ఆట పడకముందే 
పక్కాప్లాన్ గీసేయాలి.
సిన్మా చూపిస్తా మామ అంటూ
నరరూప రాక్షస సహజీవనం సాఫీగా సాగేట్లు స్లీపింగ్ పిల్స్
మింగించాలి.
రండి!సైన్మా చూసేద్దాం.
సినీ మాఫియాకు మోకరిల్లుదాం.
కామెంట్‌లు