వనరాజు: - సరికొండ శ్రీనివాసరాజు
 అడవికి రాజైన సింహం అడవి జంతువులను అనన్నిటినీ సమావేశపరచింది. తన వృద్ధాప్యం, అనారోగ్య కారణాల వల్ల త్వరలో అడవికి కొత్త రాజును నియమిస్తానని ప్రకటించింది. అలా ప్రకటించిన రోజు నుంచీ ప్రతిరోజూ అడవిలో చాలా జంతువులు సింహం దగ్గరకు పనిగట్టుకోని రావడం, సింహం ఆరోగ్యం గురించి విచారించడం, సింహం కోసం ఏం సహాయం చేయాలో చెప్పమని, తాము సింహాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అతి చేయడం మొదలు పెట్టాయి. సింహానికి కొత్త తలనొప్పి మొదలైంది. అప్పుడి సింహం మరోసారి అడవి జంతువులను అన్నిటినీ సమావేశపరచింది. తనకు ఎవరి సహాయం అక్కరలేదని అడవి మొత్తం తిరుగుతూ అడవిలో ఏ ప్రాణికి కష్టం వచ్చినా తీర్చాలని, అనారోగ్యంతో బాధపడుతున్న జీవులకు వైద్య సహాయం చేయాలని, అడవి జీవుల సమస్యలు పరిష్కరించాలని చెప్పింది. 
      అప్పటి నుంచీ చాలా జంతువులు అడవి అంతా తిరుగుతూ అడవి జీవుల కష్టాలను తీర్చడం మొదలు పెట్టినాయి. ఇప్పుడు అడవి జీవులకు ఏ సమస్యా లేకుండా హాయిగా బతుకుతున్నాయి. రోజులు, నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి. సింహమే రాజుగా ఉంటుంది కానీ కొత్త రాజు ప్రకటన లేదు. కుతూహలం ఆపుకోలేక ఒక రామచిలుక సింహాన్ని అడిగింది. "కొత్త రాజును నియమించాలనే ఆలోచన నాకు లేదు. నా ప్రకటన వల్ల అడవి జీవుల సమస్యలు అన్నీ దూరం అయినాయి. అంతకంటే నాకు కావలసింది ఏముంది?" అన్నది సింహం.
    కాలం గడుస్తున్న కొద్దీ అడవి జంతువులు ఇతర జీవులకు సేవలు చేయడం మానేస్తున్నాయి. తమకు వనరాజు పదవి రాదని ఇతర జీవులను పట్టించుకోవడం పూర్తిగా మానేశాయి. ఒక్క ఏనుగు మాత్రం సాయశక్తులా ఇతర జీవులకు సేవలు చేస్తుంది. ఇది తెలిసిన సింహం మళ్ళీ అడవి జీవులను సమావేశపరచింది. ఏనుగును వనరాజుగా ప్రకటించింది. ఆ తర్వాత సింహం విశ్రాంతి తీసుకుంది. 

కామెంట్‌లు