కక్షల గూటిలో కాచుకున్న
"కుల విషసర్పం"...
కోరలు చాచి తరతరాలుగా
బుసలు కొడుతూ చాటుమాటుగా
సమాజపు గుండెలో కాటు వేస్తోంది..!
మతం ముసుగులో
విషపు మబ్బులు కమ్ముకున్నాయి...
కులాల కుయుక్తుల కుట్రల
కుతంత్రాల మంటలు మండుతున్నాయి..!
కులం....కనపడని ఒక కరోనా వైరస్...
మతం...ఒక పిశాచి రెండూ ఏకమై
మానవత్వపు రక్తాన్ని పీలుస్తున్నాయి..!
వైరస్ సోకేది ఎవరికి..?
దళిత హృదయాలకే...
అందని నల్లని న్యాయానికే...
నవ్వలేని నిరుపేదల ఆత్మలకే..!
కులాన్ని అర్థం చేసుకున్నవారు
ఆవేశపు అగ్నిలో దహనమై
యుద్దనౌకలై ఒంటరిగా యోధుల్లా
అంటరానితనంతో యుద్ధం చేస్తున్నారు..!
ఒంట్లో ఊపిరున్నంతవరకు...
ఓపికను...ఆయుధంగా పట్టుకుని
ధైర్యాన్ని...కవచంగా ధరించి
సత్యం ధర్మం న్యాయం కోసం
సాహసంతో ముందుకు సాగుతున్నారు..!
వారే ఆ
చైతన్య దీప్తులు...
విజ్ఞాన విహంగాలు...
త్యాగాల తరంగాలు...
విప్లవ వీరులు...ఇప్పుడు నిశ్శబ్దంగా
శిలాఫలకాలపై రుద్రగీతాలు రాస్తున్నారు..!
వారి ఆత్మఘోష...
అరణ్య రోదనగా మారి
ఏడేడు తరాల రక్తధారల్లో
నేటికీ సజీవంగా ప్రవహిస్తోంది..!
మొన్నటి "రోహిత్ వేముల రోదన"...
నేటి పూరన్ కుమార్ "పాతికేళ్ల పోరాటం"
సజీవ సాక్ష్యాలు కులరాక్షసి క్రూరత్వానికి.!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి