బాలసాహిత్యం పై పెద్దల మాటలు : -సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 బాలసాహిత్యం ఎలా ఉంటే బాలల మనసులోకి ప్రవహిస్తుందో  పెద్దలు ఇలా తెలియజేశారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~---------------------------------------------------------------------
1.సరాగాల పాటల్లా, సరళమైన మాటల్లో బాలల్ని విజ్ఞాన, వినోద బాటల్లో విహరింపజేసేలా బాలసాహిత్యం ఉండాలి.---శ్రీ అలపర్తి వెంకట సుబ్బారావు.

2.నిజమైన బాలసాహిత్యం తియ్యని మామిడిపండులా ఆపాత మధురంగా ఉండాలి. భాష సరళంగానూ, లలితంగానూ ఉండాలి. చెప్పవలసిన విషయం పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు ఉండాలి.---డా. దాశరథి కృష్ణమాచార్యులు.

3.బాలసాహిత్యమంటే వేసవికాలంలో నిప్పులు చెరిగే ఎండ కాదు. రోడ్డుమీద రేచుకుక్కల పోట్లాట కాదు. బాలసాహిత్యమంటే వరిపిండి ఆరబోసినట్లు హాయిగా కనిపించే వెన్నెల్లా, సముద్రతీరంలో మనవైపు పరుగెత్తుకొచ్చే కెరటాల అల్లరిలా ఉండాలి. నవ్వులు పువ్వులూ, జాలీ లాలీ, పని పాట, ఉపకారము, ఉత్సాహము, హాయీ, రేయీ, పాట, ఆట, ఆనందం, అందం ఇవన్నీ కలబోసుకుని ఉండేదే బాలసాహిత్యం.---శ్రీ మిరియాల రామకృష్ణ.
—------------------------------------------

కామెంట్‌లు