సుప్రభాత కవిత : - బృంద
ఎదురుచూసి అలసినచూపుకి
దవ్వున వెలిగే నీ రూపం
నవ్వులు నింపి నడిపించే
ఎదుట నిలిచిన ఎదలో దైవం!

వడివడిగా పైకిదిగి 
వదలక వెంటే ఉండి
తడబడక  ఎరుకకలిగి 
మసలుకోమనే  ఆత్మబంధం!

ఆలోచనల అలజడిలో 
అల్లకల్లోలమైన మనసుకి 
అనుకోని ధైర్యం అరువిచ్చి 
అడుగు వేయించే ఆప్త నేస్తం

ఆశకు చివురులు వేయించి 
ఊహకు ఊపిరి పోస్తూ 
కలలకు రూపం ఇస్తానని 
కమ్మగా నమ్మించే కన్నతండ్రి!

రేపొక తీయని తాయిలం
వేచిన మనసుకు ఆశాదీపం
దాచిన కోరికల  తారాతీరం
కాచిన కళ్ళకు ఆనందం

మనదన్నది మనకే చేరు
తగనివన్ని  జారిపోవు 
కలిగిన తృప్తికి మించిన
కలిమి లేదోయ్ జగతిని!

🌸🌸సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు