14 వ రోజు
వ్యాసజననం
మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒక రోజు ఆ పడవలో వశిష్ట మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు పరాశరుడు ప్రయాణిస్తూ మత్స్య గంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాస భగవానుడు జన్మించాడు. పుట్టగానే వ్యాసుడు తల్లికి నమస్కరించి తనను తలచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపసు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ పై వైశంపాయనుడు దేవ దానవ అంశలతో పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా జనమేజయుడు దేవాంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుబుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలి కాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆ కాల ధర్మం అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవతులైయ్యారు. మరలా రాజులు ధర్మపరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుర్ధాయం పెరిగి మరణాలు తగ్గాయి భూభారం ఎక్కువైంది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశంతో పాండవాది రాజులు రాక్షసాంశతో కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమనే యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గకలదని భూదేవితో చెప్పారు
దేవదానవ జననం
జనమేజయుడు దేవదానవ జన్మ వృత్తాంతం వివరించమని వైశంపాయనుని కోరాడు. ఆయన ఇలా చెప్పాడు. సృష్టికి మూలం బ్రహ్మ దేవుడు. ఆయన మానస పుత్రులు మరీచి, అంగీ రసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మ దేవుని కుడి బొటనవ్రేలి నుండి దక్షుడు ఎడమ బొటన వ్రేలి నుండి ధరణి జన్మించారు. వారిరువురికి వెయ్యిమంది మహా పురుషులు జన్మించారు. దక్షునికి ఏభై మంది కుమార్తెలు జన్మించారు. వారిలో పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. వారిలో దితికి హిరణ్య కశిపుడు అతనికి ప్రహ్లాదుడు అతనికి విరోచనుడు అతని కొడుకు బలి చక్రవర్తి అతని కొడుకు బాణాసురుడు. దను అనే మరో భార్యకు 40 మంది దానవులు జన్మించారు. సింహిక అనే దానవ వనితకు రాహువు జన్మించాడు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు జన్మించారు. కద్రువకు నాగ కుమారులు జన్మించారు. బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగీరసునకు ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తనుడు అనే కుమారులు కలిగారు. బృహస్పతి ఇంద్రునికి గురువైయ్యాడు. మూడవ మానస పుత్రుడైన అత్రికి అనేక మంది మహా మునులు జన్మించారు. నాల్గవ మానస పుత్రుడైన పులస్త్యునకు రాక్షసులు పుట్టారు. ఐదవ మానస పుత్రునికి కిన్నెరలు, కింపురుషులు పుట్టారు. క్రతువు అనే మానస పుత్రునికి పక్షి జాతి పుట్టింది. దేవ్బుడు అనే వసువు కొడుకు ప్రజాపతి అతనికి అష్ట వసువులు జన్మించారు. వారిలో ప్రభావసునికి విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగువు కుమారుడు కవి అతని కుమారుడు శుకృడు. శుకృడు రాక్షస గురువైయ్యాడు. భృగువు కుమారుడు చ్యవనుడు అతని కుమారుడు ఔర్యుడు. ఔర్యుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇక భూమి పైన దేవ దానవాంశలతో రాజులు జన్మించారు. విష్ణు మూర్తి అంశతో కృష్ణుడు, ఆదిశేషుని అంశతో బలరాముడు, లక్ష్మీ దేవి అంశతో రుక్మిణీ, అప్సరసల అంశతో పదహారు వేల గోపికలు, ప్రభాసుని అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. ద్రోణునికి కామ క్రోధములు కలసి అశ్వత్థామగా జన్మించాడు. మరుత్తుల అంశతో విరాటుడు, సాత్యకి, దృపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశతో కుంతి మాద్రి జన్మించారు. ఏకాదశాంశతో కృపాచార్యుడు, సూర్యుని అంశతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు దృతరాష్ట్రునిగానూ మతి అనే దేవత గాంధారిగానూ జన్మించారు. కలి అంశతో దుర్యోధనుడు,హిరణ్యకశిపుడు శిశుపాలునిగా, ప్రహ్లాదుడు శల్యునిగా, కాలనేమి అంశతో కంసుడు, విప్రచిత్తి అనే దానవుడు జరాసంధుడిగా పుట్టారు. అశ్వపతి కృతవర్మగా గుహ్యకుడు శిఖండిగా, మరుద్గణాంశతో పాండురాజు జన్మించారు.మాండవ్యముని శాపకారణంగా యమ ధర్మరాజు విదురుడిగా జన్మించాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుని అంశతో అర్జునుడు, అశ్వినీ దేవతల అంశతో నకుల సహదేవులు జన్మించగా శ్రీ అంశతో ద్రౌపది, అగ్ని అంశతో ధృష్టద్యుమ్నుడు జన్మించారు.
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి