రావమ్మా! శ్రీలక్ష్మి:- పద్మ త్రిపురారి - జనగామ
మమత లేమిని తుంచి 
మనసు కలిమిని పెంచు 
మానవతా మూర్తిగా 
మహనీయ దీప్తిగా 
రావమ్మ శ్రీలక్ష్మి 
రావమ్మ మహాలక్ష్మి.

ధనదాహమే పెరిగి 
సిరి సంద్రమున మునిగి 
మానవత్వమే కరిగి 
రాక్షసత్వము పెరిగి 
రాయిలా మారిన 
కఠిన హృదయాలలో 
ప్రేమామృతమును 
సిరుల ధారగా కురిపించ 
రావమ్మ శ్రీలక్ష్మి 
రావమ్మ మహాలక్ష్మి.

తల్లిదండ్రులకన్న
,తోబుట్టువులకన్న
సంతసానికన్న
,సంతుమేలుకన్న
స్నేహమధురిమ కన్న
సంఘసేవకన్న
పరువు పంతమ్ములే 
పగలు ప్రతీకారమ్ములే
పసిడి ధనముగనెంచి
మిడిసిపడుతున్నట్టి
ఎదలేని మనసులకు,
వసివాడి,
మసిబారి,
నీలి నీడన నిలిచిన
హృది లేని జనతకు
మనసంత కరుణను 
మానవతా
 సిరులను 
వెలుగు ఝరులను చేయగా 
రావమ్మ శ్రీలక్ష్మి 
రావమ్మ మహాలక్ష్మి.

నీవు లేనిదె
ఈ ధరణి లేదమ్మా 
నీ దయామృతమే 
మాకు సిరులమ్మ 
ధనిక పేదలను 
భేదమ్ము చూపక 
అనురాగ విరులను 
మానవతా విలువను 
మాయందు నిలపగా 
మదిని వెలిగించగా 
రావమ్మ! శ్రీలక్ష్మి 
రావమ్మ మహాలక్ష్మి.

   

కామెంట్‌లు