రోజూ ఉదయం పూట ఓ అర గంటో ముప్పావు గంటో ఓ నాలుగైదు వీధుల్లో కాళ్ళు జాడించడం అలవాటు. అప్పుడు దార్లో ఎవరెవరో తారసపడుతుంటారు. వారిని తరచూ చూస్తూ ఉంటాను కూడా. అంతమాత్రాన ఆ చూపులేమీ పరిచయానికి పునాదులేయవు. చూసిన వారందరితోనూ మాట్లాడాలనీ అనిపించదు. కొందరు పరిచయమవుతారు. కొందరితో మాట్లాడాలని అనిపించినా మాట్లాడలేను. ఆ మధ్య ఓ పెద్దాయాన తరచూ కనిపించేవారు. ఆయనను పలకరిద్దామనుపించి నమస్తే సార్ అన్నాను. ఆయన తల ఆడించారు. నా పేరు చెప్పి ఫలానా అని పరిచయం చేసుకున్నాను. అయితే ఆయన " మొహంమీద కొట్టినట్లే నేనెవరితోనూ మాట్లాడను. నాకు పరిచయాలూ అనవసరం " అని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన వాలకం విచిత్రమనిపించింది. బక్కపాటి శరీరం. ఆయనను చూడగానే ఎనబై ఏళ్ళ పెద్దవారని అంచనా వేయొచ్చు. కానీ ఆయన మాటతీరుతో అంత పెద్దమనిషి ఎందుకని ఇలా మాట్లాడారో బోధపడలేదు. ఆయనతో అలాంటి చేదు అనుభవం ఎదురవడంతో నేనుగా పరిచయం చేసుకుని పలకరించడం దాదాపుగా పూర్తిగా తగ్గించేసుకున్నాను. అఫ్ కోర్స్ అందరూ అలా ఉంటారని అనడం లేదు. అదలా ఉంటే ఒకరిద్దరు వారంతట వారు పరిచయమై మాట్లాడిన వారూ ఉన్నారు. అలా మాట్లాడిన వారిలో ఒకరు పి. కృష్ణ గారు. విచిత్రమేమిటంటే పరిచయమై మాట్లాడుకున్నాక పూర్వంలా ఆయన కనిపించడం లేదు. మూడో కలయికలో ఆయన తమ ఇంటికి తీసుకువెళ్ళి ఓ కవితల పుస్తకం కూడా ఇచ్చారు. అది వచన కవితా సంపుటి. ఈ పుస్తకం పేరు వేకువ తుషారం. ఈ కవిత్వ రచయిత్రి ఆయన శ్రీమతే. పేరు పి. భారతీకృష్ణగారు. ముఖచిత్రం బాగుంది.
ఈ 'వేకువ తుషారం' అనే కవితా హారం పూర్తిగా అమ్మవారి అనుగ్రహమని, తనకు తెలియకుండానే ఎన్నో అంశాలపై కవితలు వ్రాయడం, వాటిలో కొన్ని ముద్రణకు నోచుకోవడం, జరిగినట్లు భారతీకృష్ణగారు తమ ముందుమాటలో చెప్పుకున్నారు. ముఖ్యంగా ప్రకృతి అంటే ఆవిడకు సహజమైన ఇష్టంతో కొంచెం వర్ణనకూడా జోడించి వ్రాసిన కవితలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. అలాగే అమ్మవారి సేవలో వున్నారు కాబట్టి, ఆ భక్తి భావంతో, భగవంతుని సేవలో తరించాలనే తపనతో భక్తిపరంగా కొన్ని కవితలూ వ్రాసారు. తెల్లవారి లేస్తే ఎదురయ్యే సామాజిక అంశాలను నిలదీస్తూ వ్రాసే వాటికన్నా.. ఆ సమస్యలను కాస్సేపు మరిపించి, మనసుకి ఆహ్లాదం, శాంతీ చేకూర్చాలన్నదే ఆవిడ ముఖ్య ఉద్దేశ్యం. తన రచనలన్నీ తల్లితండ్రుల ఆశీర్వాదమూ, భర్త శ్రీకృష్ణ, పిల్లలు, సోదరి, సోదరుల ప్రోత్సాహంతో సాగినవే అని అంటారు. కలం తనదైనా కలంలోని బలం మాత్రం దైవానుగ్రహమే అని విశ్వసించే ఆవిడ ప్రచురించిన ఈ పుస్తకంలో మొత్తం 70 కవితలున్నాయి. వాటిలో ఎక్కువ కవితలు ఋషిపీఠంలో అచ్చయ్యాయి. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనలు అర్పిస్తూ అక్షరాంజలి కవిత (పేజీ 12) లో ఇలా అంటారు...
“ఈ సరస్వతి... సౌమ్య రూపు రేఖా వికసిత శోభల తేజరిల్లు శివశక్తి… అక్షరాలను మంత్రపుష్పాలుగా పరిమళింపజేయు దేవలోక దివ్య మాలతి .. సుస్వర దైవ కీర్తనల సేవించు.. సామవేద సాహితి... శాస్త్రపురాణేతిహాసముల నలతివ్యాఖ్యానముననందజేయు… ప్రవచన ప్రభా భారతి.... ఈ ఋషిపీఠ మానసపుత్రి...మనోజ్ఞాన నేత్రి... విరించి విశేష సృష్టి లీలా విలాస కారణా విభూతి... సంగీత, సాహిత్య అఖిలనాద సుధామహతి... వాగ్దేవీ వరపుత్ర.. అద్భుత శుభ మంగళ కీర్తి... పుంభావ సరస్వతి...ఈ సమన్వయ సరస్వతి...!! ...అంటూ ఆయన పట్ల తమకున్న గౌరవభావాన్ని చెప్పుకున్నారు.
రహస్యం అనే శీర్షికతో మొదలైన కవిత్వ పుస్తకంలో చివరి వచన కవిత “అమ్మా వచ్చావా “. అయిదు పేజీల ఈ చిన్న కథనం అమ్మ కవితలు పోటీలో (విజయనగరం) గెలుపొందిన కవితకూడా కావటం గమనార్హం. అమ్మతిథిని గుర్తుచేసుకుంటూ అల్లిన పదబంధం ఆసక్తిగా సాగింది.
అలాగే రెండు పేజీల్లో (పేజీ నెంబర్లు 105, 106) పరచిన అమ్మమ్మ పాలెపు భవానీ శంకరమ్మకు అంకితం చేస్తూ రాసిన అమ్మమ్మ రుచులు కవిత చాలా బాగుంది. అమ్మమ్మ వంటలు ఎప్పుడూ రూచిగా ఉంటాయి. వాటి ముందు ఈనాటి బిర్యానీలూ, ఫ్రైడ్ రైసులూ అన్నీనూ ఏపాటి.
ఉద్యోగం చేస్తూ కష్టపడుతున్న కూతుర్ని చూస్తూ ప్రతి అమ్మ మనసూ, తల్లడిల్లే క్రమాన్ని రచయిత్రి గువ్వ – గుబులు శీర్షికతో రాశారు. ఈ కవితలో ఒకచోట...అందంగా ముద్దుగా వుండే నిన్ను పట్టి, పెంచుకుందామని ఎవరైనా ఎత్తుకెళ్ళలేదు కదా....కన్నా వేగిరం రా ...మ్మా....మేత కోసం వెళ్ళిన నీ నేస్తాలందరూ నువ్వు రాలేదేమని అడుగుతున్నారు....నీ మీద బెంగతో దిక్కు తోచక...ఆ కొమ్మపైనా ఈ కొమ్మపైనా ఎగురుతూ వున్నాను...అని ఓ తల్లి గువ్వ బాధను రెండు పేజీల్లో చెప్పిన బాధను ఉద్యోగానికి వెళ్ళిన కూతురు ఇంటికి వచ్చే వరకూ ఆలోచించే తల్లి మనసుకు అద్దం పడుతుంది.
ఇక నాన్నకు ప్రేమతో...కవితలో ...మహారాజశ్రీ నాన్నకు మీ కూతురు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ....వ్రాయునది ఏమనగా... మేం క్షేమంగా వున్నాము, మీరు క్షేమంగా వున్నారని తలుస్తున్నాను....నాన్నా ఉత్తరం రాయడం ఆలస్యమైనందుకు, ఏమీ అనుకోకు.
రాగానే పిల్లల స్కూళ్లు తెరవడంతో...ఆ హడావుడి సరిపోయింది....ఎండలు ఎక్కువగా వున్నాయి. నాన్నా, నువ్వూ, అమ్మ జాగ్రత్త.....రాగుల జావ, పళ్లరసాలు.... తాగుతూ వుండండి.....సాయంత్రం ఆరు దాటితేగాని బయటకు వెళ్లకు.....నేను కూడా నువ్వు చెప్పినట్టుగా.....పిల్లలకు మజ్జిగ అన్నం ఎక్కువగా తినిపిస్తున్నాను.....పిల్లలు ఆడుకుంటున్నారు అని రాసిన కవిత చదువుతుంటే లేఖాసాహిత్యం గుర్తుకొచ్చింది. వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చి మింగేసిన ఉత్తరాల కాలం కనుమరుగైపోవడం బాధాకరం. పోస్టుమ్యాన్ నుంచి ఉత్తరం అందుకుని చదవడంలోని ఆనందం వాట్సప్ మెసేజస్ లలో ఏముంటుంది.
ఇటీవలి కాలంలో నేను చదివిన మంచి పుస్తకాలలో ఈ వేకువ తుషారం ఒకటి.
రచయిత్రి శ్రీమతి పి. భారతీకృష్ణగారి స్వస్థలం కపిలేశ్వరపురం. ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్ (తెలంగాణం). 1990 నుండి ఆమె రాసిన అనేక కథలు, కథానికలు, నాటికలు రేడియోలో ప్రసారమయ్యాయి. వందకు పైగా కవితా రచనలు చేసిన ఈవిడ కర్ణాటక సంగీతం 'వీణ'లో రామకోటి మ్యూజిక్ కాలేజ్ ద్వారా బి.ఎ. డిగ్రీ చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా 'బి' గ్రేడ్ గాయనిగా గుర్తింపు పొందిన భారతీకృష్ణగారు పలు అష్టావధానాలలో పృఛ్ఛకురాలిగా పాల్గొనడం విశేషం. పలు సినీ సంగీత కార్యక్రమాలకు ప్రముఖ వేదికలపై వ్యాఖ్యాత్రిగా వ్యవహరించడమే కాకుండా అనేక సన్మానాలుకూడా పొందిన ఈవిడను
'విశ్వావసు' నామ సంవత్సరం 2025లో శ్రీ కమలాకర్ ట్రస్టు వారు 'కవిరత్న' బిరుదుతో సత్కరించారు.
1997 (28 సంవత్సరాలు) నుండి శ్రీ భ్రమరాంబ సేవా బృందం వ్యవస్థాపక కార్యదర్శిగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం (శివపురి, మల్కాజిగిరి, హైదరాబాద్) లో అమ్మవారి సేవతో పాటు ప్రముఖులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు, శ్రీ గరికపాటి నరసింహా రావు గారు, మైలవరపు శ్రీనివాస్ గార్ల, ప్రవచనాలు, అవధానాలు, సాంస్కృతిక, ఓల్డ్ ఏజ్ ఆశ్రమాలకు వేద పాఠశాలలకు నారాయణ సేవలతో కార్యక్రమాలు నిర్వహించడం గమనార్హం.
‘వేకువ తుషారం' కవితా సంపుటి ఆవిడ మూడో పుస్తకం. అంతకుముందు
'అదిగో భద్రాద్రి నాటికల సంపుటి, 'వందనం' ఆధ్యాత్మిక స్తోత్ర రత్నావళి సంకలనం వెలువడ్డాయి.
రాసే ప్రతి అక్షరం అమ్మవారి ఆశీర్వాదంగా శిరసావహిస్తూ నేటికీ రచనలు కొనసాగిస్తున్న పి. భారతీకృష్ణ గారికి వందనాలు.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి