మూగబోయిన పాకశాలకు
అలికిడైతే ఆనందం
పొగచూరక,మసిబారక,జిడ్డుపట్టక చూసుకొనే చిమ్నీల హారాలు ధరించే రసవతికి
శబ్దాలు జరిగితే ఆహ్లాదం
ఘుమఘుమలు వెదజల్లే వంటింటికి పోపులు పెడితే
నిత్యనీరాజనం
తరతరాలు ఎడబాయక చూసిన కిచెనుకు పొయ్యి వెలిగిస్తే సుప్రభాతం
కుక్కర్ విజిల్ కూతలు,తిరగమోతల కుతకుతలు,మిక్సీల బరబరలు,
వెట్ గ్రైండరులు రోటి చప్పుడులు,చవులూరించు వైవిధ్య రుచుల రంగరింపులు,
షడ్రుచుల మేళవింపులు,బుభుక్షలను చల్లార్చే పాక శాస్త్ర పలకరింపులు లేకపోతే,
శాక,ప్రశాఖల ప్రస్తావనలు మృగ్యమైతే,
నలభీమపాకాలు స్విగ్గీ,జొమాటలు అపహరిస్తే,
వంటిల్లు చిన్నబోతుంది.
అనేక పదార్థాల ఆవిష్కరణకు నిలయమైన,
అమ్మ చిరునామాకు ఆలవాలమైన ఆ మందిరం
దిక్కులేనిదవుతుంది.
ఆరోగ్యము,ఆనందము కలగలిపి వడ్డించిన ఆగ్నేయాస్త్రము నిర్వీర్యం అవుతుంది.
పాల పొంగింపులకు,తీపి మధురిమలకు మంగళం పాడకూడదు.
ఎందరో తల్లుల హస్త ఉత్పత్తి క్షేత్రాన్ని చిన్నబుచ్చవద్దు.
ఇంట చేసిన వంటే అమృతమని మరువద్దు.
కలికాలాన కలిమి ఎంతున్నా,
అమ్మలాంటి వంటిల్లే ఆరోగ్యప్రదాయిననే సత్యాన్ని చెరిపివేయవద్దు.
ఇంట చేసుకొని తిను అనే నినాదాన్ని మార్మోగిద్దాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి