సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు, ఖమ్మం

 సామెత -15: - అన్న వస్త్రాల కోసం పోతే - ఉన్న వస్త్రాలు ఊడ దీసుకున్నట్టు

****
"అవ్వా! అవ్వా! గీ  యిసయం నీదాకొచ్చిందా?
గా పీనాశి పీరయ్య  ముచ్చటేనా . వాడింక బేహోషై మడుసుల్ల గల్వలేదుగా.అయినా గా ఆశపోతు గాడికి గట్లనే గావాలె.ఎన్నడన్న "పిల్లికి బిచ్చం పెట్టిండా? 'ఎంగిలి చేత్తో కాకిని గొట్టిండా'?
 అవ్వ అంతటితో ఆగకుండా "పక్కూర్లెవలో  ముక్కూ మొగం తెల్వని పెద్ద మడిషి పట్టుబట్టలు,వెండి గిన్నె పెడుతుండంటే గీడెట్ల నమ్మిండు.అందునా పెళ్ళాన్ని దీస్కొని పెళ్ళికి బొయినట్టు బోతడా? గా దానికన్న మతిండొద్దా? మెడగున్నె దిర్గకుండా నగలు దిగేసుకొని బోతదా? అవ్వ? చిన్న పోరడికి జెప్పినా గామత్తరం ఇంగితం లేదా అంటడు.
 అవ్వ మాటలిన్కుంట బుగ్గలు నొక్కుకుంటూ "గివ్వన్ని నీకెట్ల దెల్సినయ్ అవ్వా! నువ్వేమన్న కిట్ట పరమాత్తుని శెల్లవా? ఆయిన ఆత్మవా? అన్నీ సూసినట్టె సెబుతుండవ్"!
ఊరు ఊరంతా కోడై కూత్తుంటే గా పరమాత్తనే కావాల్నానే. ఆ పీరయ్య,ఆడి పెళ్ళాం ఆలకాన్ని ఇద్దరు దొంగ పీనుగలు మా బాగా పసిగట్టిండ్రంట."
"అవునవ్వా!"అన్న వస్త్రాల కోసం బోతే ఉన్న వస్త్రాలు ఊడదీస్కున్నట్టు" అయ్యిందిగ".
"కాదు మరి. గాళ్ళ టక్కరి మాటలు గీళ్ళెట్ల నమ్మిండ్రు."ఒంటిమీద కొత్త బట్టలు, బుట్టెడు నగలేస్కపోతే  పాత సీర గూడ బెట్టరు.గాయన బెట్టేది  బీదోళ్ళకి. మరి మీ కవ్వి గావాలంటే  మేమిచ్చినవి  గట్టుకోని పోండ్రి.గట్ల మేం చానా మందికి ఇప్పిచ్చినం అనంగనే, ఈళ్ళు గొర్రెలొతికె తలూపి గాళ్ళిచ్చిన పాతబట్టల గట్టిండ్రంట?ఒంటి మీద నగలొల్చి దస్తీల మూట గట్టి "దొంగకు తాళం చెవులు చేతికిచ్చినట్టిచ్చిండ్రు".  "గేటు కాడే ఉంటం పోండ్రని  నమ్మబల్కి లోపల్కి బంపిండ్రంట. గీళ్ళు లోపలికి బొయ్యి సూత్తే  ఏముంది?గక్కడ పడావు పడిన బంగల. అదురుకోని బయటికొత్తె ఆ టక్కరోళ్ళు ఎప్పుడో ఉడాయించిండ్రంట. లబ్బలబ్బ నెత్తి నోరు గొట్టుకుంట ఇంటికొచ్చిద్దరు బెహోషై పడ్డరు.
నేనెల్లి మొఖాన నీళ్ళు జల్తే పెళ్ళాం లేసి కూసుంది. గా దాన్ని అడిగితెనే గీ యిసయం జెప్పుకొని గోడు గోడున ఏడ్వ బట్టింది.ఏడిత్తె గాదు గా దొంగ మొకాల గురించి పోలీసులకు జెప్పాలన్న. గాళ్ళొచ్చి ఏందేందో శాట బార్తం రాస్కొని బోయిండ్రు. అదృట్టం ఎట్టుంటదో సూడాల! 
"అవునవ్వా!  గసుంటోళ్ళకు గట్లనే గావాల"అనుకుంట వెళ్తున్న రంగమ్మత్త వొంక జూస్తూ " అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు  ఊడ దీస్కున్నట్టు అంటేందవ్వా?"  అడిగిన భూలచ్మితో ....
 అతి ఆశకు బోతే,మళ్ళ ముక్కూ మొగం తెల్వని వాళ్ళని నమ్మి మన విషయాలన్నీ జెప్తే, గిట్ల పీరయ్య తాతోళ్ళలా ఉన్నవన్నీ పోగొట్టుకునుడే వుంటది.ఈ తాత ఏమన్న బీదోడా?బిక్కోడా? గంతాశెందుకు? " అంటున్న  అవ్వ మాటలు భూలచ్మికి అర్థమై కానట్టు ఉన్నయ్.
గదండీ సంగతి! అన్న వస్త్రాలకు బోతే ఉన్న వస్త్రాలు ఊడదీస్కున్నట్టు!" అంటే ఇదే..
కామెంట్‌లు