సుప్రభాత కవిత : - బృంద
కరిగిపోయే కాలమంతా 
సాగిపోయే ఏరులాగే 
ఏదీ వచ్చినా ఆగలేదు 
వేడుకైనా వేదనైనా....

ఎత్తు పల్లపు దారులన్నీ 
దాటి వచ్చే సెలయేరు 
ఆగదెన్నడు  హడలిపోయి 
దారి మార్చి సాగిపోదా?

చెంత చేరిన చెట్టూ చేమను 
వంతగా సాగే రాలుటాకులను 
తోవలో దొరికే  కొత్త నేస్తాలను 
కలివిడిగా కలుపుకోదా!

జలకాలాడే చిన్ని గువ్వలు 
ఊయల్లు ఊగే పెద్ద కొమ్మలు 
గెంతులు వేసే చిట్టి చేపలు 
అన్నీ తనలో  వుంచేసుకోదా?

నిండుగ సాగే పయనంలో
కొండల కోనల గమనంలో
ఎండిన  బండలపై కడలికి
ప్రేమలేఖ రాసుకోదా?

జీవితంలో ప్రతిక్షణం 
రసవంతం చేసుకోవడం 
మనకు మనమే నేర్పుకునే 
ముచ్చటైన ముఖ్య పాఠం!

ఆనందమే పరమావధిగా 
అనుదినమూ ఆహ్లాదంగా 
అంతరంగం  ఆనందమయం 
చేసుకొమ్మని వచ్చే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు