కొందరికి వరం...
కొందరికి శాపం...
మతం నేడు కొందరికి రక్షణ కవచం...
కొందరికి మారణహోమం రక్తపాతం...
ఓ మనిషీ..!
నీ మనసు అద్దంలో పేరుకున్న
దురహంకారపు దుమ్ము దులుపుకో..!
సమానత్వం...సమాధి కాకమునుపే...
మానవత్వం...మంటకలిసి పోకముందే...
నీ హృదయపు తలుపులు తెరిచిచూడు...
ఇది కులగజ్జి మతపిచ్చి పిశాచాలు
తిరిగే మనుశాస్త్రం పుట్టిన నేల...
వాటి అడుగుల కింద నలుగుతున్న
పీడిత తాడిత బడుగు బలహీన వర్గం
నిగ్గుతీసి అడుగుతోంది...
సిగ్గులేని ఈ సమాజాన్ని...
“మేం ఏ తప్పుచేశాం"...?
బడికెళ్తే చదువుకుంటే
నాలుకల పై వాత...
దైవం దర్శనం లేకుండా
గుడి తలుపుల మూత...
దాహమేసి చెరువులో
నీరు ముట్టుకుంటే మైల...
గోమూత్రంతో శుద్ది...
మా జీవనమే ఒక శిలువశిక్షగా
కులకక్షగా మారిందే ఎందుకని..?
ఓ మతోన్మాదులారా..!
ఓ కులదురహంకారులారా..!
ఒక్క క్షణం ఆలోచించండి...
మీ ఇంట పశువు చచ్చినా
మనిషి చచ్చినా వచ్చి శవాన్ని మోసేది...
స్మశానంలో కాల్చేది, సమాధి చేసేది...
ఈ పీడిత వర్గమే కదా..!
ఆర్థికంగా చితికినా, మానసికంగా క్రుంగినా
మీ కర్మకాండలకండగా ఉండేది వీరే కదా.!
జలగలకైనా ఇంత జాలి ఉంటుందేమో
కానీ మీలో లేదే దయ అణువంతైనా..?
నోరులేని ఈ బడుగు బలహీన వర్గాలపై
కనిపించదే కనికరం కారుణ్యం కాసింతైనా
తరతరాలుగా
కులకుంపటిలో కాలిపోతూ
ఒక జాతి బూడిదైపోతుంటే...
మీరు "అగ్నికి ఆజ్యం" పోస్తున్నారే...
కులం పేర...
కుమ్ములాటలు...
మతం పేర...
మారణహోమాలు సృష్టిస్తున్నారే...
అహంకారంతో...
అధికారంతో దౌర్జన్యాలు చేస్తున్నారే...
ఇంకెంతకాలం ఈ చీకటి నాటకం..?
ఓ మతోన్మాదులారా..!
ఓ కులదురహంకారులారా..!
మీరు మారాలి...మీరు మారాలి...
మీ మనస్తత్వం...
మీ ఆలోచనా ధోరణి మారాలి...
మీ రక్తంలో
ప్రవహించాలి..."మానవత్వం"...
మీలో వెలగాలి...
"సమానత్వ సౌభ్రాతృత్వ దీపం"...
మీరు మారాలి మనుషులుగా
ఇకనైనా ఈ కంప్యూటర్ యుగంలోనైనా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి