షిజో కనకురి -నమ్మశక్యం కాని నిజం:- - యామిజాల జగదీశ్
 అది 1912. స్టాక్‌హోమ్ ఒలింపిక్స్ సమయం. జపాన్ కు చెందిన అథ్లెట్ షిజో కనకురి, అసాధారణ నిడివితో చరిత్రలో నిలిచిపోయే మారథాన్‌ను ప్రారంభించాడు. కానీ ఇది కేవలం మారథాన్ కాదు. ఇది ఒలింపిక్ క్రీడలలో ఇప్పటివరకు నమోదైన అతి పొడవైన రేసుగా మారింది.
వేసవి వేడి మధ్య, కనకురి నీరసించిపోయాడు. దాంతో మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి స్థానికంగా ఓ ఇంట్లో ఆగాడు. తరువాత, కొనసాగించడానికి ప్రయత్నించాడు. కానీ అలసట అతనిని ముందుకు సాగనివ్వలేదు. అతను నిశ్శబ్దంగా మారథాన్ రేసుని విడిచిపెట్టి, ఒలింపిక్ అధికారులకు తెలియజేయకుండా జపాన్‌కు తిరిగొచ్చాడు. 
విషయం తెలియని స్వీడిష్ అధికారులు సంవత్సరాల తరబడి అతనిని  "తప్పిపోయినట్లు" గా ప్రకటించారు. కానీ అసలు కథ ఎవరికీ తెలియలేదు. 
ప్రపంచం యావత్తు అతను అదృశ్యమయ్యాడని భావించారు. కానీ కనకురి జపాన్‌లో పూర్తి జీవితాన్ని గుట్టుగా గడిపాడు. అతను వివాహం చేసుకున్నాడు. భౌగోళిక పాఠాలు బోధించే ఉపాధ్యాయు డయ్యాడు. ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. పది మంది మేధావులు, మనవరాళ్లతో హాయిగా గడిపాడు.
1967 వరకు అతని కథ ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత స్వీడిష్ టెలివిజన్ అతనిని గుర్తించి చాలా సంవత్సరాల క్రితం అతను సగంలోనే వదిలివేసిన రేసును పూర్తి చేయమని ఆహ్వానించింది.
అతని జీవితంలో ఇది ఒక అద్భుతమైన మలుపు. 54 సంవత్సరాల తరువాత, కనకురి స్టాక్‌హోమ్‌కు తిరిగి వచ్చి,  చిరునవ్వుతో మారథాన్ ముగింపు రేఖను దాటాడు. 
"ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణ
మార్గంలో, నేను వివాహం చేసుకున్నాను. కుటుంబాన్ని చూసుకుంటూ ఆనందంగా గడిపాను!" అని చమత్కరించాడు.
అతను మారథాన్ ను పూర్తి చేయడానికి తీసుకున్న అధికారిక సమయం ఎంతో తెలుసా? 54 సంవత్సరాలు, 8 నెలలు, 6 రోజులు, 5 గంటలు, 32 నిమిషాల 20.3 సెకన్లు. కానీ ఇక్కడ కనకురికి, నిజమైన విజయం సమయం కాదు. ఇది 
జీవితం. అతను ప్రారంభించిన దానిని పూర్తి చేయడం ముఖ్యమైన విషయం.
జీవితం కేవలం వేగం లేదా సాధన గురించి కాదు. ఇది ప్రయాణం. అడ్డంకులను అధిగమిస్తూ వేగంతో సంబంధం లేకుండా ముందుకు సాగడానికి చూపిన పట్టుదల ప్రధానం.‌ అదే చరిత్ర పుటలకెక్కింది. ఈ విషయాన్నే మనం గమనించాల్సింది. 


కామెంట్‌లు