*సంపూర్ణ మహాభారతము సరళ వ్యావహారిక భాషలో...!
 

ఆది పర్వము పంచమాశ్వాసము- * 24వ రోజు
కుంతీ మాద్రి పాండురాజుల వివాహం
కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయం వరం ప్రకటించాడు. స్వయంవరంలో పృధ పాండురాజుని వరించింది. వారిద్దరికి వివాహం అయింది. ఆ తరువాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రి వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత పాండురాజు ద్విగిజయ యాత్ర చేసి నాలుగు దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులను చేసాడు. పాండురాజు నూరు అశ్వమేధ యాగాలు చేసాడు.
పాండురాజుకు శాపం
ఒక రోజు పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు.ఆయనతో కుంతి మాద్రి కూడా వెళ్ళారు.ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కనపడక విసిగి చివరకు ప్రణయకలాపంలో ఉన్న జింకలపై బాణం వేసాడు. అందులో ఆడజింక చనిపోగా మగజింక పాండురాజుని చూసి " రాజా వేటాడుట రాజుల ధర్మం అయినా పరుగెత్త లేనివి, రోగంతో బాధపడేవి, ప్రణయకలాపంలో ఉన్నవి అయిన జంతువులను వేటగాడు కూడా కొట్టడు. అన్ని ధర్మాలు తెలిసిన రాజువు ఇలా కొట్టావు కనుక నీవు భార్యలను చేరిన మరుక్షణం మరణిస్తావు " అని శపించి మరణించింది. ఆ శాపం విన్న పాండురాజు దుఃఖించి తనదగ్గర ఉన్నవి అన్నీ దానం చేసి భార్యలను చూసి మీరు కూడా హస్థినాపురం వెళ్ళండి అన్నాడు. వారు వెళ్ళటానికి నిరాకరించి భర్తతోనే ఉండి పోయారు. పాండు రాజు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆశ్రమం నిర్మించుకుని ముని వృత్తిని అవలంబించి తపసు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఒక రోజు మునులందరూ బ్రహ్మలోకానికి ప్రయాణం కావడం చూసి పాండురాజు కూడా వారితో బయలుదేరాడు. ఋషులు వారిని చూసి ఇవి దేవ మార్గాలు వీటి వెంట మీరు రాలేరు అన్నారు. పుత్రులు లేరు కనుక తను వెళ్ళడానికి తగనివాడని పాండురాజు గ్రహించి మునులతో ఆ విషయం అన్నాడు. వారు దివ్యదృష్టితో చూసి " పాండురాజా నీకు సంతాన యోగం ఉన్నది సంతానం కోసం ప్రయత్నించు " అని చెప్పారు.
పాండురాజు కోరిక
పాండురాజు తనలో పురుషునికి ఈ లోకంలో దేవఋణం, ఋషి ఋణం, పితృఋణం, మనుష్య ఋణం ఉంటాయి. ఆ ఋణాలు తీర్చకపోతే పుణ్యలోకాలు ఉండవు యజ్ఞముల వలన దేవఋణం, వేదాధ్యయనం వలన ఋషి ఋణం, దయాగుణంతో మనుష్య ఋణం తీర్చుకున్నాను. కుమారులు లేనందున పితృ ఋణం తీరదు. శాపం వలన పుత్రుల యోగం లేదు కదా అని చింతించాడు.కుంతీ దేవిని పిలిచి సంతానం లేకుండా జీవించడం కంటే మరణించడం మేలు.కుంతీ నాకు ధర్మ మార్గంలో కుమారులను కని ఇవ్వవా అని అడిగాడు." కుంతీ పుత్రులు ఆరు రకాలు ఔరసుడు, సహోఢుడు, క్రీతుడు, పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతుడు. వారిలో ఔరసుడు క్షేత్రజ్ఞుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కనుక క్షేత్రజ్ఞుడు మేలు . దేవరన్యాయంతో పుట్టిన పుత్రుడు ఉత్తముడు.పూర్వం కేకయ రాజుకు సంతానం లేని కారణంగా ఆయన భార్యను ఆకార్యానికి నియోగించగా ఆమె పుంసవన హోమం చేయించి ఋత్విజ్ఞుల ద్వారా ముగ్గురు కుమారులను పొందింది. కాబట్టి క్షేత్రజ్ఞులను కని ఇవ్వు" అని వేడుకున్నాడు. బదులుగా కుంతీ దేవి " రాజా మీ ధర్మపత్నులమైన మేము వేరెవరిని తలపలేము.పూర్వం పూరు వంశంలోని వ్యుతితాష్వుడు అనే రాజు నూరు అశ్వమేధ యాగాలు చాసాడు. ఆయన విపరీతమైన భోగలాలసతో క్షయరోగం వచ్చి మరణించగా అతని భార్య అతనిని స్మరించి సంతానవతి అయింది. కనుక పాండురాజా నువ్వు కూడా అలా సంతానాన్ని పొందవచ్చు" అన్నది. పాండురాజు కుంతీ చెప్పిన మార్గం ఆచరణ సాధ్యం కాదని అనుకున్నాడు. పాండు రాజు కుంతితో పూర్వం స్త్రీలు సర్వస్వతంత్రులు వారు భర్త అనుమతితో కానీ భర్త అనుమతి లేకుండా కానీ సంతానవతులయ్యేవారు. ఒకరోజు ఉద్దాలకుని భార్య ఋతుమతి అయిన తరుణంలో ఇంటికి అతిధిగా వచ్చిన ఒక వృద్ద బ్రాహ్మణుడు ఆమెయందు సంతానం పొందాలని అనుకున్నాడు. అది చూసిన ఉద్దాలకుని కుమారుడు కోపించి అది ధర్మ విరుద్ధమని భావించాడు. ఆరోజు నుండి అతడు స్త్రీలు పరపుషులను కోరకూడదని అలా చేస్తే పాపం వస్తుందని కట్టడి చేసాడు. అప్పటి నుండి స్త్రీలు భర్త అనుమతి లేకుండా పర పురుషుని చేరడం లేదు కానీ భర్త అనుమతితో పొందవచ్చు. కల్మషపాదుడు తన భార్య దమయంతిని దేవరన్యాయం ప్రకారం సంతానాన్ని ఇవ్వమని నియోగించగా ఆమె వశిష్టుని వలన అశ్మకుడు అనే కుమారుని పొందింది. అలాగే నీవు కూడా దేవర న్యాయంతో నాకు పుత్రులను పొంది ఇవ్వు నీకు చేతు లెత్తి నమస్కరిస్తాను.అని దీనంగా వేడుకున్నాడు.

భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు