దీపావళి భారతీయ సంస్కృతిలో వెలుగుల పండుగ గా ప్రాచుర్యం పొందింది.ఈ పర్వదినాన ఇంటి ముంగిళ్లలో, దేవాలయాల ప్రాంగణాలలో, వీధుల వెంట వేలాది దీపాలను వెలిగిస్తారు. అయితే, ఈ దివ్యమైన దీపారాధన వెనుక ఉన్న అర్థం కేవలం అలంకరణకు మాత్రమే పరిమితం కాదు .అది ఒక గాఢమైన ఆధ్యాత్మిక సంకేతం గా శాస్త్రాలు వర్ణిస్తున్నాయి.
ప్రతి దీపం అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టే జ్ఞానానికి ప్రతీక. ఉపనిషత్తులు చెప్పినట్లుగా: “తమసో మా జ్యోతిర్గమయ” — అంటే "అంధకారం నుండి వెలుగులోకి నడిపించు" అని అర్థం. దీపావళి రోజున వెలిగించే ప్రతి జ్యోతి మన అంతరంగంలోని చీకటిని — దురభిప్రాయాలు, లోభం, క్రోధం, అసూయ, భయం వంటి అరిషడ్వర్గాలను — దహించివేసి, జ్ఞానం, శాంతి, ఆనందాల వెలుగును విశ్వమంతా ప్రసరిస్తుంది.
పురాణ కధనాల ప్రకారం దీపావళి రోజునే మర్యాద పురుషోత్తముడు అయిన శ్రీరాముడు లంకేశ్వరుడైన రావణుడిని సంహరించి, పద్నాలుగేళ్ల వనవాసం అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ సందర్భంలో అయోధ్య ప్రజలు పట్టణం నిండా దీపాలు వెలిగించి, తమ ప్రియతమ రాజుకు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. మరొక ముఖ్య విశ్వాసం ఏమిటంటే, ఈ రోజున మహాలక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ, పరిశుభ్రమైన హృదయాలు, కాంతిమయమైన గృహాలను తన కరుణా కటాక్షాలతో ఆశీర్వదిస్తుందని శాస్త్రవచనం. అందుకే ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించడం అనాదిగా సంప్రదాయంగా మారింది — ఎందుకంటే వెలుగు, శుభ్రత అనేవి లక్ష్మీ సాన్నిధ్యానికి చిహ్నాలు.
శుభం కరోతి కల్యాణం ఆరోగ్యం ధనసంపదః।
శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోఽస్తు తే॥
శుభాన్ని ప్రసాదించేది, మంగళాన్ని కలిగించేది, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనసంపదను ప్రసాదించేది,శత్రువుల దుష్బుద్ధిని నాశనం చేసేది —
ఆ పవిత్రమైన దీపజ్యోతి దేవతకు నా నమస్కారం.
దీపం కేవలం కాంతికి సంకేతం మాత్రమే కాదు, అది సమతుల్యతకు కూడా ప్రతీక. దీపం శిఖరంలో ఉన్న జ్వాల మన ఆత్మను సూచిస్తుంది — ఇది ఎల్లప్పుడూ ఊర్థ్వముఖంగా ఎదుగుతూ, అడ్డంకులను, చీకటిని తొలగిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు “జ్ఞాన దీపేనా భాస్వతా అజ్ఞానం నాశయామ్యహమ్” — అంటే జ్ఞానమనే దీప కాంతితో అజ్ఞానాన్ని సమూలంగా దహింపజేస్తాను. దీపావళి అనేది ఆ జ్ఞానదీపాన్ని మన ఆత్మలో వెలిగించుకునే శుభ సమయం.
దీపాలను వెలిగించడం కేవలం ఆచారం కాదు; దానికి శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. నూనె లేదా నెయ్యి దీపం వెలిగించినప్పుడు ఆ మంట ద్వారా విడుదలయ్యే నెగటివ్ అయాన్లు వాతావరణంలో ఉన్న హానికర బ్యాక్టీరియా, వైరస్‌లను నశింపజేస్తాయి. దీపం వెలిగించిన ప్రదేశం చుట్టూ ఆక్సిజన్ స్థాయి స్వల్పంగా పెరుగుతుంది, గాలి పరిశుభ్రంగా మారుతుంది. దీపం యొక్క మృదువైన కాంతి తరంగదైర్ఘ్యం మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది; అందుకే దీపం ముందు ధ్యానం లేదా ప్రార్థన చేయడం మనసుకు శాంతినిస్తుంది. అంతేకాక, దీపం వెలిగించే సమయంలో మంట యొక్క ఇన్‌ఫ్రారెడ్ తాపం చుట్టుపక్కల ఉన్న సూక్ష్మ కీటకాలను నశింపజేస్తుంది. అందువల్ల దీపావళి వంటి ఉత్సవాల్లో వందలాది దీపాలు వెలిగించడం వల్ల వాతావరణం శుభ్రంగా, శాంతిగా, సానుకూల శక్తితో నిండిపోతుంది.
ప్రతి ఇంటి ముందు దీపాలు ఉంచడం అంటే సమాజమంతా ఒకే వెలుగులో మునిగిపోవడం. మన వ్యక్తిగత సంతోషం ఇతరుల ఆనందంతో కలిసిపోవడమే దీని అంతరార్థం. కాబట్టి దీపావళి కేవలం వ్యక్తిగత పండుగ కాదు, అది సామూహిక వెలుగుల ఉత్సవం మరియు సామరస్యానికి ప్రతీక.
ఇతర విశిష్టతలలో, ఈ పండుగ సందర్భంలో నరక చతుర్దశి నాడు శరీర శుద్ధి కోసం అభ్యంగన స్నానం చేస్తారు. ఇది కేవలం బాహ్య పరిశుభ్రత మాత్రమే కాక, మనసులోని మలినతలను తొలగించే సంకేతం. గోవర్ధన పూజ, బలిప్రతిపద, యమ దీప దానం వంటి ఉప ఉత్సవాలు మన జీవన విలువల వైవిధ్యాన్ని, ఈ పండుగలోని సంపూర్ణతను సూచిస్తాయి.
ఇంకా ఒక ఆసక్తికర విశేషం ఏమంటే — దీపం వెలిగించడానికి ఉపయోగించే వస్తువులకు కూడా తాత్వికమైన అర్థం ఉంది. నూనెను మన మానవ వాసనలుగా, వత్తిని మన మనస్సుగా, జ్వాలను మన జ్ఞానంగా భావిస్తారు. మనసు వత్తిలా నిలకడగా ఉంటేనే, జ్ఞానం అనే జ్వాల నిరంతరం, స్థిరంగా వెలుగుతుంది.
దీపావళి మనకు నేర్పేది ఒకే ఒక నిత్య సత్యం — చీకటి ఎప్పుడూ వెలుగును ఓడించలేదు. అట్లే ధర్మాన్ని ఎప్పుడూ అధర్మం జయించలేదు. ఒక చిన్న దీపం సైతం చీకటి గదిని పూర్తిగా వెలిగించగలదంటే, ఒక చిన్న శుభభావన మనసులోని నిశ్శబ్దాన్ని, నిరాశను పారదోలగలదు.
కాబట్టి దీపావళి అంటే కేవలం బాణా సంచా ఉత్సవాలు, అలంకరణలు కాదు; అది మన అంతరంగంలోని దివ్యజ్వాలను మేల్కొల్పే ఒక గొప్ప ఆధ్యాత్మిక వేడుక. ప్రతి దీపం ఒక పవిత్రమైన వాగ్దానం — “అజ్ఞానాన్ని జ్ఞానంతో, భయాన్ని ధైర్యంతో, చీకటిని ప్రేమతో జయిద్దాం” అనే సంకల్పానికి నిదర్శనం.
దీపజ్యోతి పరబ్రహ్మ :-సి.హెచ్.ప్రతాప్
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి