సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -31: -అండలేని ఊళ్ళె ఉండరాదు -ఆశలేని పుట్టింటికి పోరాదు
****
"ఇగ్గో అవ్వా!గిదిన్నవా? గా పోతులూరి బెమ్మచారన్నోళ్ళు మూటా ముల్లె సదురుకొని ఊళ్ళెకేలి ఎల్లిపోతుండ్రంట.ఎవ్వలికి సెప్పొద్దని గోవిందమ్మొదిన సేతిల సెయ్యేయించుకుంది. పాపం గాళ్ళకి ఇల్లెల్లక కనాకట్టంగుందటవ్వా!
 అవును శెల్లె! కాలమస్సలు మంచిగ లేదు.మొన్నమొన్నటి దంక గాళ్ళకి మంచాలు,కుర్సీలు,తల్పు దర్వాజలని సేతి నిండ పనుండె. గిప్పుడవన్ని ఎవలు సేయిత్తుండ్రు. పేటకు బొయ్యి శటుక్కున షాపుల్ల కెళ్ళి నచ్చింది తెచ్చుకుంట్రుడు.
అవునవ్వా!గందుకే కూటిగ్గుడ్డకు సుత ఎల్లేట్టు లేదని దుఃఖ పడ్కుంట ఎల్తుండ్రు.
అయ్యో! గట్లనా శెల్లె! పాపం! గా బెమ్మచార్కి సేతిల పన్లేదాయె.ఇగ్గ ఆమ్దాని ఏన్నుండొత్తది.రెక్కల కట్టం మీద బతికేటోళ్ళాయె. ఇన్నాళ్లు  బెమ్మచారి సేతాలం బాగుందని మెచ్చుకున్న గా తరం బోయె. గీ కాలపోల్లకు ఏం దెల్సు?కడ్పుల బుట్టిన కొడ్కులేమో చెట్టుకోలు పుట్టకోలన్నట్టు బత్క బోయిండ్రు.ఇంగ ఎవలండగుంటరు. అడివిల పొలం లేదయ్యె ఊళ్ళె ఆయిమన్న యిల్లు  సుత లేదయ్యె- ఒక్కలన్న ఆదుకునే మడిసి లేడయ్యె.
గందుకనే " అండలేని ఊళ్ళె ఉండరాదు-ఆశలేని పుట్టింటికి పోరాదని ఊరికే అనలేదే శెల్లె."
 అయ్యో! గట్లంటివేందక్క !గిసుంటి కట్టమొచ్చినప్పుడే గద పుట్టింటోళ్ళు కడ్పుల బెట్ట్కొని సూస్కునేది.
గాళ్ళిద్దరి ముచ్చెట్ల నడ్మల...
"అమ్మ నాయిన కాలం జేసిండ్రొదినే. అన్న మనోడైతె వదినె మనదవ్వుద్దా! అమ్మ నాయిన ఉన్నొద్దులే పెట్టుబోతలు బందుబెట్రి. గిప్పుడేమొగమేస్కొని పోతవ్వా!"
"గప్పుడే వొచ్చిన గోవిందమ్మ గా మాటల్కి బదులిచ్చుకుంట అవ్వని కావలిచ్చుకొని గోడు గోడున ఏడ్సింది.
గిన్నాళ్ళు ఇంటి గుట్టు గడ్ప దాటకుండ  బత్కినవ్ వొదినా! గీ వయసుల నీకు గింత కట్టమొచ్చె. తల్సుకుంటె నాకే దుఃఖమాగట్లే.ఇగ్గో వొదినా! దా!పసుబ్బొట్టు తీస్కుందువని దేవునర్రలకి తోల్కపోయి, కళ్ళ నీళ్ళు దుడిసి బొట్టు బెట్కుంట "ఆడదాని కట్టం ఆడదాన్కే తెల్సేది.గీ పైసలు బగ్గ కట్టమొచ్చినప్పుడు తీసి ఆడుకో వదినా! బొడ్లె దోపిన కీసల్నించి ఐదేల కట్ట దీసి గిది నీకు నాకే మూడో కంటికి తెల్వొద్దన్కుంట  గోవిందమ్మ సేతుల బెట్టి పైట సాట్న దాస్కొమ్మని గుసగుసగా జెప్పి  బైటికి దీస్కొచ్చింది.
 శెల్లెతో మాట్లాడొదిన! అన్కుంట ఉట్టి మీద సల్ల ముంత దీసి ముగ్గురికి గిలాసల్ల బట్కొచ్చింది.
గవి తాగి మల్లొక్కపాలి అవ్వ మంచితనాన్ని తల్సుకుంట గుడ్ల నీళ్ళు తుడ్సుకుంటు ఎల్లొత్తనని సెప్పి పోతున్న గోవిందమ్మొంక  చేట్టలుడిగి అట్టాగే సూత్తుండి పోయారిద్దరు.
గదండీ సంగతి! "అండలేని ఊళ్ళె ఉండరాదు-ఆశలేని పుట్టింటికి పోరాదు "అంటే గదే మరి.మారిన గీ రోజుల్ల ఎవరికెవరు అండ వుండటమనేది అనేది ప్రశ్నార్థకమే!

కామెంట్‌లు