అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు పొందిన శ్రీకాకుళం టీచర్లు.
 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు చౌధరి రాధాకృష్ణ ,

అలిగి ధూళికేశ్వర రావు, కొమ్మన పురుషోత్తంలకు దక్కిన గౌరవం...
తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జి.ఎస్.పి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ ఐదున బహూకరించు అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికై సత్కారాలు పొందారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు శ్రీకాకుళం పట్టణానికి చెందిన చౌధరి రాధాకృష్ణ, కళింగపట్నానికి చెందిన అలిగి ధూళికేశ్వరరావు, అరసవల్లికి చెందిన కొమ్మన పురుషోత్తం ఈ అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికై సన్మానాలు గైకొనిరి. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనెల ఐదున కరీంనగర్ పట్టణంలో వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో పండుగ వాతావరణం లో జరిగిన కార్యక్రమంలో వీరిని ఘనంగా సన్మానించారు. సొసైటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు గంగారపు మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ  విద్యావేత్త డా.అట్ల శ్రీనివాసరెడ్డి, గంగారపు సుమలత అవార్డీలకు బంగారు పతకం, దుశ్శాలువ, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.
నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ కాలం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉపాధ్యాయునిగా పనిచేసిన చౌధరి రాధాకృష్ణ జాతీయ స్థాయిలో పిన్న వయసులోనే 36 ఏండ్లకే రాష్ట్రపతి కె ఆర్ నారాయణన్ చేతులమీదుగా 1997 సెప్టెంబర్ 5 న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయులకు మాడ్యుల్స్, మానవ విలువలు పరిరక్షించి  పెంపొందించే ఆనంద వేదిక పుస్తక రచయితగా విద్యారంగానికి ఆయన సుపరిచితులు.. జాతీయ విద్యా, పరిశోధన మరియు శిక్షణ మండలి వారిచే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ నుండి మరో జాతీయ అవార్డు స్వీకరించిన ఆయన రూపొందించిన పరిశోధన పత్రాలు అనేక అంతర్జాతీయ, జాతీయ వేదికలపై ప్రెజెంట్ చేసారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, జూనియర్ రెడ్ క్రాస్, అక్షరాస్యత ఉద్యమం, యువజన విభాగాల్లో విశేష సేవలందించి  ప్రశంసలు అందుకున్నారు. టిబెట్ మాజీ ప్రధాని దలైలామా, మహాత్మా గాంధీజీ ముని మనుమరాలు, కస్తూరిబా ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు శ్రీమతి తారా భట్టాచార్జీ వంటి అనేకమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి , ఉపాధ్యాయ ప్రగతి మాసపత్రిక ( ఎ పి టి ఎఫ్ ) కు సంపాదక వర్గ సభ్యులు కూడా సేవలందించారు .రాధాకృష్ణ బహుగ్రంథ కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి...
 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు స్వీకరించిన అలిగి ధూళికేశ్వర రావు, కొమ్మన పురుషోత్తం అక్షరాస్యత , సామాజిక రుగ్మతలపై ఉద్యమాలు చేసారు. పాఠశాల, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి చేశారు. నాణేలు, తపాలా బిళ్ళలు, ప్రపంచ పర్యాటక ప్రదేశాల చిత్రాల ప్రదర్శనలు నిర్వహించారు. జూనియర్ రెడ్ క్రాస్ లో సేవలందించారు.
కామెంట్‌లు