ఉపాధ్యాయుడు.!!:-డా ప్రతాప్ కౌటిళ్యా.
ఉపాధ్యాయుడు 
నీరు లాంటివాడు 
రంగు రుచి వాసన లేనివాడు.!!

నీరులా మృదువైనవాడు 
నీరులా ఏ ఆకారం లేనివాడు 
ఏ ఆకారంలోకైనా మారేవాడు 
మార్చేవాడు.!!

నీరు లా ఆగనివాడు
నదిలా ప్రవహించేవాడు 
జలపాతంలా దూకేవాడు 
నీరులా ఆగనివాడు 
ఆగితే సముద్రమవుతాడు. 

ఎంతో ఎత్తున ఉన్న 
నిన్నే తాకే వాన చుక్క లాంటి 
ప్రత్యేకమైన వాడు. 

నీవు తెంచిన తెగనివాడు 
నీవు కాల్చిన 
మళ్లీ మేఘమయ్యేవాడు 
అతడు ఉపాధ్యాయుడు!!

ఆకాశంలోంచి దిగివచ్చి 
భూమిపై అవతరించిన వాడు.!!

ఉపాధ్యాయుడు 
గాలి లాంటివాడు 
రంగు రుచి వాసన లేనివాడు 

కనిపించని దేవుని లాంటి వాడు 
చల్లదనాన్ని ఇచ్చే చల్లనివాడు 
కనిపించని ప్రాణానికి 
ప్రాణవాయువు లాంటివాడు. 

అందరికీ అందుబాటులో ఉండే 
ఆపద్బాంధవుడు 
అతడు ఉపాధ్యాయుడు. 

ఆకాశంలోంచి దిగివచ్చి 
భూమిపై అవతరించిన వాడు 
అతడు ఉపాధ్యాయుడు. 

ఉపాధ్యాయుడు 
పచ్చని చెట్టు లాంటివాడు 
నీడ నిప్పు ఫలం ఇచ్చేవాడు 
ప్రతిఫలం ఆశించని వాడు 

మైదానాన్ని ధనంగా మార్చేవాడు 
భూమిని పచ్చదనంగా మార్చేవాడు
మహారణ్యాన్ని సృష్టించేవాడు 
అతడు ఉపాధ్యాయుడు.!!!


ఈరోజు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని.

డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు