సుప్రభాత కవిత : - బృంద
వేదనకు వగచినా 
వేడుకకు మురిసినా 
వేయి భావాలు దాచు 
కడలంటి  మనసు

అలజడి కలిగినా 
అనలము రగిలినా
వెలుపల తెలియనివ్వని
లోతైన అంతరంగం

అడుగున దాచిన 
తలపుల పొరలలో 
ఎగసిన కోరికలు
ఎన్నో ఆపిన ఎడద

చేరని తీరం కోసం 
చేతులు సాచి 
చెలియలికట్టను తాకి
వెనుతిరిగే హృదయం

మాయకు లోనై
మమతల వలలో చిక్కి 
మరిగే తలపుల నడుమ
మరణపు అంచుకు చేరే మది

సంద్రపు లోతున మునిగిన
అందమైన ఆలోచనలు
అణచి ఆనందం నటియించు
అమాయక అనురాగ నిధి

అలుపెరుగని బాటసారి
ఆగమించి పెల్లుబికే
ఆప్యాయతలు ఎల్లెడలా పంచి
అపేక్ష కురిపించే  ఆదిదైవానికి

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు