తిరుమలరావుకు అభిరామ సంస్థ పురస్కార ప్రశంసాపత్రం

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, మరో ఘనత సాధించారు. అభిరామ సాహితీ కళా సేవా సంస్థ అంతర్జాలం ద్వారా మూడు కవితలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన కవితలు  విజేతగా నిలిపాయి. ఫలితంగా సాహితీ పురస్కార ప్రశంసాపత్రంతో పాటు విజయచిహ్నం జ్ఞాపికలను సాధించారు. హైదరాబాద్ కేంద్రంగా వసుదైక కుటుంబం, కాంక్రీటు అడవులు అనే అంశాలపై కవితను, పసిబాలుడు గడ్డి పూలకు రంగులు పూస్తున్న చిత్రంపై చిత్ర కవితను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా.నూతి అభిలాష్ ఆధ్వర్యంలో ఆహ్వానించగా తిరుమలరావు స్పందించారు. ఆయప పంపిన కవితలు నిర్వాహకులచే విజేత స్థానాన్ని పొందాయి. తిరుమలరావును మిక్కిలి అభినందిస్తూ విజేతగా ఎంపిక చేసి, సాహితీ పురస్కార ప్రశంసాపత్రాన్ని, విజయచిహ్నం జ్ఞాపికను పంపారు. ప్రక్షాళన శీర్షికతో వేళ్ళేకదా మహా వృక్షానికైనా నాంది పునాది అని ప్రశ్నిస్తూ, పచ్చని కాపురాన నిప్పులు పోయకు అనే సామెతను గుర్తుచేస్తూ, పచ్చదనం విలువేమిటో తిరుమలరావు తన కవిత్వంలో చాటిచెప్పారు. బాలల హక్కులు పరిరక్షిస్తూ నేటి తరాలకు కాలుష్య రహిత సమాజమే మన లక్ష్యమని పిలుపునివ్వాలంటూ ఆయన రచించారు. అలాగే వనాలు భవనాలు శీర్షికతో పంపిన మరో కవితలో కాకులు దూరని కారడవులు మాపి కాంక్రీటు కట్టడాలతోనూ, చీమలు దూరని చిట్టడవులు కాల్చి భవన నిర్మాణాలతోనూ పర్యావరణానికి ముప్పు తెచ్చుట తగదంటూ తిరుమలరావు తన కవితలో చాటి చెప్పారు. భూమి లోపలి నిక్షేపాలకు సత్యాన్వేషి వనసంపదేనని, ప్రకృతి ఉనికికి నిలువెత్తు సాక్ష్యం అటవీ సంపదేనని మానవాళి గుర్తెరగాలని, అందుకే విరివిగా మొక్కలు నాటాలని ఆయన తన కవితలో రచించారు. 
తిరుమలరావుకు విజేత సాహితీ పురస్కార ప్రశంసాపత్రం, విజయ చిహ్నం జ్ఞాపికలు లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు