స్నేహితుల కొరతతో
జీవితం సతమతం
“నెట్‌వర్క్ బలంగా ఉంది... కానీ హృదయ కనెక్షన్ లేదు!”
- మానవ సంబంధాల ముసురు వెనుక దాగిన ఒంటరితనం
“మా కాలంలో స్నేహం అంటే ప్రాణం పెట్టేవాళ్లం…”అని పెద్దవాళ్లు చెప్పినప్పుడు, ఈ తరం యువత నవ్వేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఆ మాటలో ఒక వేదన ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్నేహం డిజిటల్ అయిపోయింది.మనసులు కనెక్ట్ కాకుండా, కేవలం మొబైల్స్ కనెక్ట్ అవుతున్నాయి.
ఫాలోవర్స్ ఉన్నారు… కానీ ఫ్రెండ్స్ లేరు!
ప్రతి యువకుడి ఫోన్‌లో వందలాది కాంటాక్టులు ఉంటాయి. కానీ కష్ట సమయంలో ఫోన్ చేయగల నిజమైన స్నేహితుడు ఎంతమంది?
సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి జీవితం “హ్యాపీ”లా కనిపించినా,
వారి మనసులో ఎంత ఒంటరితనం ఉందో ఎవరికీ తెలియదు.
లైక్‌లు, కామెంట్లు, స్టోరీ రిప్లైలు…
ఇవే ఇప్పుడు సంబంధాల ప్రమాణాలు.కానీ వీటిలో “మనసు” లేదు. మనిషి ఇప్పుడు “ఎమోజీల”తోనే భావాలను పంచుకుంటున్నాడు, కానీ ఎవరో ఎదురుగా కూర్చుని మాట్లాడే ఆనందం మరచిపోయాడు.
ఒంటరితనం… మౌన వ్యాధి
మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం స్నేహితుల కొరత అని వైద్యులు చెబుతున్నారు పట్టభద్రులైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, జీవిత వేగంలో చాలామంది స్నేహాన్ని వెనక్కి నెట్టేస్తున్నారు. దానితో మనసు మూగబడి పోతుంది. ఒంటరితనం మానసిక ఆరోగ్యాన్ని మెల్లగా దెబ్బతీస్తుంది.ఇది డిప్రెషన్‌గా, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడంగా మారుతోంది. ఇటీవల నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం
18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతలో
40 శాతం మంది ఒంటరితనం, డిప్రెషన్‌తో బాధపడుతున్నారు.
ఇది కేవలం భావోద్వేగ సమస్య కాదు.సమాజం ఎదుర్కొంటున్న కొత్త మానవ సంక్షోభం.
స్నేహం.. ఒక మానసిక శ్వాస
స్నేహితుడు అనేది కేవలం నవ్వించేవాడు కాదు.మనసును నిలబెట్టే బలం. మన సమస్యలు వినేవాడు, మనం పడిపోతే పట్టుకునేవాడు. అలాంటి వ్యక్తి లేకపోతే జీవితం అర్ధం కోల్పోతుంది. మనసు ఉత్సాహంగా ఉండాలంటే, పాజిటివ్ ఎనర్జీ కోసం
నిజమైన స్నేహం తప్పనిసరి.
స్నేహితుడి అండ మనసుకు ఆక్సిజన్ లాంటిది.
ఇది ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడు.
సొసైటీకి అవసరమయ్యే మార్పు
స్నేహం అంటే కేవలం “క్లాస్‌మేట్”, “ఆఫీస్‌మేట్” కాదు.మనసుతో మిళితమయ్యే సంబంధం.
మన సమాజం మళ్లీ మానవ సంబంధాల వైపు మళ్లాలి.
టెక్నాలజీ మనం ఉపయోగించాలి ..కానీ, మనసులను దూరం చేయనివ్వకూడదు. యువత రోజుకు గంటసేపు స్క్రీన్ నుంచి దూరంగా ఉండాలి. ఒక పాత స్నేహితుడిని కలవాలి.
నిజమైన సంభాషణలు జరగాలి.
స్మైలీ కంటే స్మైల్ ఇచ్చే ప్రయత్నం చేయాలి.
చివరగా…
మనిషి గొప్పవాడు అవ్వవచ్చు, ధనవంతుడు అవ్వవచ్చు —
కానీ స్నేహం లేని జీవితానికి అర్థం లేదు. ప్రపంచాన్ని జయించినవాడు కూడా ఒంటరితనంలో ఓడిపోవచ్చు. అందుకే .స్నేహం అనేది మనసును కాపాడే మందు.
దానిని వదలొద్దు, మరవొద్దు.
ఒక స్నేహితుడిని కాపాడడం అంటే ఒక మనిషిని కాపాడినట్టే.
మీ
స్నేహితుడు
--ఎస్.వి.రమణాచారి, సీనియర్ జర్నలిస్ట్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి