కిరణాల రాగిణులు
ధరణిని చేర వేగమే
నీరద యవనిక తొలగ
నిశ్శబ్ద విస్ఫోటనం చెందె!
నిశీధిని నిలిచిన కాలము
పయనము మొదలైన తీరున
నిట్టూర్పుల నిడి తరువులు
నీహారికలకు వీడుకొలు పలికే!
మెల్లమెల్లగా వెలుగు తెరలు
ఎల్లెడలా పరచుకుంటూ
మంచుముత్యాల మాలలు
ఎదను ధరించి మురిసె!
అవనీతలపు ఆణువణువునూ
ఆదరముగా పలుకరించి
ఆలింగనము చేసుకొన్న కాంతి
ఆత్మీయతను ప్రకటించె!
నులివెచ్చని కిరణమాలి
తొలి పలకరింపుతో
తేలి తేలి పరవశించి
నీలి నింగి పొంగిపోయె!
ఆనందము నిండిన
అంతరంగమునందు
ఆత్మీయతగా అంకురించు
అందమైన అనుభూతి ప్రేమ!
విశ్వమునకు చేయు మేలు
విశ్వాత్మకునికి చేరు
సాటివారికి చేయు సాయము
మేటిగా భావించు దైవము!
🌸🌸సుప్రభాతం🌸🌸

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి