స్వయంకృతం :- సరికొండ శ్రీనివాసరాజు
 ఇంటర్వెల్ సమయం. విద్యార్థులంతా బయటికి వెళ్ళినారు. సోము తాను అస్సలు ఓర్వలేని వంశీ సంచిలోని కంపాస్ బాక్స్ తీశాడు. అందులో 500 రూపాయల నోటు కనిపించింది. సోము ఆ నోటును దొంగిలించాడు. సాయంత్రం వేళ సమీపంలోని కిరాణా దుకాణం వద్దకు వెళ్లి, చాక్లెట్లు కొన్నాడు. మరునాడు తన పుట్టినరోజు సందర్భంగా ఆ చాక్లెట్లను తన క్లాస్ మేట్సుకు పంచాడు. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 
     ఆరోజు లంచ్ టైంలో వంశీ సోమును కలిశాడు. "సారీ సోము. ఈరోజు నీ పుట్టినరోజు అని నాకు ముందే తెలుసు. 3 రోజుల క్రితం నీ ప్రాణ మిత్రుడు రంగతో నువ్వు చెబుతుంటే విన్నా. నీకేమైనా మంచి బహుమతి ఇవ్వవాలని నేను దాచుకున్న 500 రూపాయలు నిన్న తెచ్చుకున్నా. కానీ ఎవడో నీచుడు, దుర్మార్గుడు దొంగతనం చేశాడు. వాడు బాగు పడడులే. వాడికి ఇంతకు వందరెట్లు నష్టం జరగాలని దేవుడిని ప్రార్థించాను. ఆ పాపాత్ముని పుణ్యమా అని నా స్నేహితుడిని సర్ప్రైజ్ చేసే అవకాశం కోల్పోయాను." అని అన్నాడు వంశీ.
      సోము ఖంగు తిన్నాడు. తన నీచ బుద్ధి వల్ల నష్టపోయింది తానే. 
 

కామెంట్‌లు