సామెతల ఊట -సునందమ్మ నోట:- వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు,ఖమ్మం

సామెత-24:- అతని కంటే ఘనుడు, ఆచంట మల్లన్న
*****
"అవ్వా! అవ్వా! గియ్యాల మా పెద్ద సారు  ఎన్మిదో తరగతి సదివే సత్నారి అన్నను పట్కొని మస్తు దిట్టిండు. నీయన్నే నయం అనిపిస్తుందిరా."ఆడే మా చెడ్డ చికాకోడు.ఆడితోనే బల్లె ఏగలేక సస్తున్నమనుకున్నం గని గాడ్ని మించిపోయినవ్ గదరా! "అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న" అన్నట్టు తయారైనవ్". గిట్ల గాదు గని రేపు మీ అమ్మ నాయిన్ని తోల్కొని రా.గాళ్ళతోనే నీ సంగతేందో మాట్లాడుతా! అన్నడు. "అవ్వా! మరి మరి "అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న" అంటే ఏందే!అని అడిగిన భూలచ్మిని సూస్కుంట...
గిది పుట్టి నేర్సిందో పుట్టక నేర్సిందో గని దీని తల్కాయ నిండ పశ్నలే.కదే భూలచ్మి! మురిపెంగ తల నిముర్తూ "దీన్కో కత జెప్త.గదింటే గిదేందో నీకే తేటగ అర్థమైతది" మరింటవా సెప్పు?
 ఇంట అని బుద్దిగా తలూపుకుంట"ఒరేయ్! బుడ్డోడా!రారో?అవ్వ కత సెప్తదంట!గట్టిగా కేకందుకుంది.గా మాట చెవుల బడంగనే భూలచ్మి దోస్తులు, బుడ్డోడు దోస్తులు చెట్టు మీద పచ్చులాలినట్టు రివ్వున అవ్వతాన కొచ్చి సుట్టూ కూసుండ్రు.
అనగనగా ఓ అడివి.పక్కూరికి బోవాల్నంటే గా అడివిల్నించే బోవాలె.అయితే గా అడివిల ఓ దొంగ ఉండేటోడు. దొంగెట్టుంటడో తెల్సు గద! అనంగనే ..
"ఓ తెల్సు.  మన తాతకొతికె ఇంతింత లావున బుర్ర మీసాలుంటై." అనంగనే.. 
"ఏయ్ మాతాతొతికంటవని కయ్యానికి కాలు దువ్వుతున్న బుడ్డోడిని భూలచ్మి ఆపి మన తాత లెక్క గా దొంగకు ఉన్నయట తీ! మద్దెలో లొల్లి జేయకనింది.
"అవ్వా! గా దొంగ గల్ల లుంగీ గట్టుకునేటోడా? కళ్ళే అగుపడేట్టు గుడ్డముక్క గట్కునేటోడా?ఆడి సేతిల కత్తి ఉందా? ఆడు నల్లంగుండా? తెల్లంగుండా?.."
అంటున్న భూలచ్మితో ఎహె! ఆగే తల్లీ! నీకు కత కావాల్నా? గీటన్నిటికి జవాబులు గావాల్నా? అనంగనే సటుక్కున నోటి మీద ఏలేసుకుంది.
 "గా దొంగ ఏంజేసోటోడంటే. ఒక్కలో,ఇద్దరో గా దార్న బొయ్యిండ్రన్కో.ఇగ ఇంతే సంగతులు.ఆళ్ళ దగ్గరున్న డబ్బూ-దస్కం,మూటా ముల్లెనే గాకుండ పెయ్యి మీదున్న అంగీ లాగు గూడ గుంజుకునేటోడు.
పొద్దు గుంకిందంటే సాలు ఆవూర్కి ఈ వూర్కి పన్ల మీద ఒచ్చి పొయ్యేటోళ్ళకు దడే దడ."గీ దొంగ పాడుగాను, ఒంటి మీద అంగిలాగన్న ఉంచడాయే. గా పాపిట్టోడు వల్ల గట్ల బనీన్ డాయరు మీద ఊళ్ళెకు రావలంటె మస్తు సిగ్గుబోతుందని బాధ పడేటేళ్ళు.అనంగనే "అయ్యో ! పాపం గద అవ్వా! గందుకే దొంగలంటే మస్తు బయ్యం నాకు. ఒక్కొక్కలు కళ్ళు భూచక్రాల్లా తిప్పుతూ గుండెల మీద చేతులు ఏసుకుంటుంటే.
ఇంగ ఏమిట్లకేమైంది? కతంత ముందే వుంది అంటుంటే చెవులు రిక్కించి ఇనసాగిండ్రు.
దినాలు ,నెలలూ ఏళ్ళకేళ్ళు గడిసిపోయినయ్. గా దొంగోడు ముసలోడై తన పని కొడుక్కి అప్పజెప్పిండు. గాడు గూడ అయ్య లెక్కనే  దొంగతనాలు జేసుడు షురూ జేసిండు.
ఒకపాలి గా ముసలి దొంగకి "తనను అందరు మెచ్చుకోవాలనే కోర్కె బుట్టింది. "ఏరా కొడ్కా! జనాలందరూ నన్ను మెచ్చుకోవాలంటే ఏం జేయాల్రా?అడిగిండంట.
గప్పుడు కొడుకు "నాయినా !ఇన్నాళ్ళు దొంగతనం జేసినయ్ దానదర్మాలు చేత్తవా? మరి జెప్పు అన్నడంట.
చత్! గట్లెట్ల మన బతుకే దొంగ బతుకు. గసుంటివి ఉండవ్! ఇంకేదైన చెయ్ రా!ఎట్టైనా  నన్ను గాళ్ళంత మంచోడనాలె అన్నడంట.
"పికరు జేయకు నేనే ఏదో ఓటి జేత్తలే" అని బాగా ఆలోచించిండంట.
 కొన్ని దినాలు గడిసే తల్కి ఊళ్ళో జనాలంత గగ్గోలు పెడుతున్నరంట. గవి తండ్రికి ఇన్పిచ్చాలని మారేషాలు ఏస్కొని గా వూళ్ళెకు దీస్కొచ్చిండు.
 గా పెద్ద దొంగే నయం. మంచోడు.పెయ్యి మీది డాయరు బనీనునన్న ఉండనిచ్చిండు. "గీ సిన్న దొంగ సేతులిరగ. గవి గూడ ఊడదీస్కుని  బట్టలన్ని ఇప్పి దీస్కొని బరిబాతల ఎల్లగొడ్తుండు."అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న"  సామెత లెక్కయినవి గా దొంగ బారిన పడ్డ బత్కులు" అనుకుంటున్న గీ మాటలిని  తనను అందరు మెచ్చుకుంటున్నందుకు మస్తు సంబురపడ్డడంట గా పెద్ద దొంగ.."
గా కతల"బరిబాతల" పదం బట్టుకొని పొల్లగాండ్లు ఒక్క నవ్వుడు గాదు పో.
గిదండీ! సంగతి "అతడి కంటె ఘనుడు ఆచంట మల్లన్న" సామెత కతలో  బరిబాతల అంటే మీకు సుత తెల్సి పోయిందిగా." దొంగలు దోసుకునుడేమొ గని మీగ్గూడ మస్తు నవ్వొచ్చే ఉంటది కదూ.
కామెంట్‌లు